‘అమ్మా.. నా మనసు విరిగిపోయింది’.. ముస్సోరీలో టెకీ మృతి కేసులో వెలుగులోకి సంచలన ఆడియో!

by Ramesh Naini |

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖకు చెందిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.

‘అమ్మా.. నా మనసు విరిగిపోయింది’.. ముస్సోరీలో టెకీ మృతి కేసులో వెలుగులోకి సంచలన ఆడియో!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖకు చెందిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఆమె భర్త శ్రీచరణ్‌పై ఇప్పటికే పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, తాజాగా ఈ కేసులో కీలక ఆధారాలు బయటపడ్డాయి. మృతురాలు చనిపోవడానికి ముందు తన తల్లితో మాట్లాడినట్లుగా భావిస్తున్న ఓ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి ఈ సంచలన ఆడియో క్లిప్ బయట పెట్టినట్లు తెలుస్తోంది.

కలకలం రేపుతున్న ఆడియో క్లిప్

తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో ఆధారంగా, రాధా గాయత్రి తన భర్త ప్రవర్తన పట్ల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. భర్త వేధింపులపై ఆమె తన తల్లి వద్ద వాపోయినట్లు సమాచారం. ఆడియో క్లిప్ ప్రకారం.. తన భర్త తనపై నిరాధారమైన అనుమానాలు పెంచుకొని, ఇతరుల వద్ద తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన తప్పేమైనా ఉంటే నేరుగా అడగమని అత్తయ్యను సైతం నిలదీశానని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ఇన్నాళ్లూ తాను ఎంతో ఓపిక పట్టానని, కానీ అతడు అన్ని హద్దులూ దాటేశాడని, ఇకపై తన భర్తతో మాట్లాడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పినట్లు ఆడియో ద్వారా అర్థమవుతోంది.

భర్త ప్రవర్తనపై తల్లి సత్యవతి తీవ్ర ఆరోపణలు

మరోవైపు, రాధా గాయత్రి తల్లి సత్యవతి తన అల్లుడు శ్రీచరణ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. వివాహమైనప్పటి నుంచే అతడు తన కుమార్తెను మానసికంగా వేధించేవాడని చెబుతూ పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడించారు. భార్యపై ఉన్న అనుమానంతో ఆమె బ్యాగ్‌లో శ్రీచరణ్ ‘జీపీఎస్ ట్రాకర్’ అమర్చాడని, ఆమె ఎక్కడికి వెళ్తుందో ఎప్పటికప్పుడు గమనించేవాడని తెలిపారు. ఆమె ఆఫీస్‌లో ఉన్న సమయంలో తరచూ వీడియో కాల్స్ చేసేవాడని, బెడ్‌పై ఎవరు ఉన్నారో చూపించాలంటూ అనుమానంతో వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇద్దరూ కలిసి మద్యం సేవించినట్లు పోలీసులకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

ఏకాంత ఫోటోలను పంపేవాడు

భార్యాభర్తల ఏకాంత ఫోటోలను అర్ధరాత్రి వేళ తమకు పంపేవాడని, ఇదంతా చూస్తుంటే శ్రీచరణే తన కూతురిని పథకం ప్రకారం హత్య చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికితీయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బయటపడిన ఆడియో క్లిప్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దర్యాప్తు పురోగతిపై అందరి దృష్టి నెలకొంది.

Next Story