చేనేత పోరు షురూ.. ఎట్టకేలకు మోగిన ఎన్నికల నగారా!

by Jakkula.Mamatha |

ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన చేనేత సహకార సంఘాల ఎన్నికలకు ఎట్టకేలకు తెరలేచింది.

చేనేత పోరు షురూ.. ఎట్టకేలకు మోగిన ఎన్నికల నగారా!
X

దిశ,కొల్చారం: ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన చేనేత సహకార సంఘాల ఎన్నికలకు ఎట్టకేలకు తెరలేచింది. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లాలోని చేనేత సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎనిమిదేళ్లుగా పాలకవర్గాల ఎన్నికలు జరగకపోవడంతో ఇన్‌చార్జిల పాలన కొనసాగగా, తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పదవుల కోసం పోటీ పడే అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు.

16 సార్లు గడువు పొడిగింపు..

జిల్లాలో కొల్చారం మండలం రంగంపేట, పెద్దశంకరంపేట, ముస్లాపూర్, మెదక్, అల్లాదుర్గం, పాపన్నపేట చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 1,100 మంది సభ్యులు ఉన్నారు. 2018 ఫిబ్రవరిలో పాలకవర్గాల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా 16 సార్లు గడువు పొడిగించారు. రెండేళ్ల క్రితమే ఓటరు జాబితా సిద్ధమైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగలేదు.

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో..

నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆయా సంఘాల పరిధిలో ప్రత్యేక అధికారులు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. సంఘాల కార్యాలయాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రదర్శించారు. ఇప్పటికే సభ్యుల్లో ఎన్నికలపై ఆసక్తి పెరగగా, అభ్యర్థులు ఓటర్ల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు.

ఎన్నికల షెడ్యూల్..

*జూన్ 22 నుంచి 24 వరకు నామినేషన్ల స్వీకరణ.

*జూన్ 25న నామినేషన్ల పరిశీలన.

*జూన్ 27న అర్హుల జాబితా ప్రకటన,

నామినేషన్ల ఉపసంహరణ.

అదే రోజు ఎన్నికల గుర్తుల కేటాయింపు

*జూన్ 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్

మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

ఫలితాల ప్రకటన. అనంతరం మూడు రోజుల్లో కార్యవర్గ ఎన్నిక

వేడెక్కుతున్న చేనేత రాజకీయాలు..

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో చేనేత సంఘాల్లో రాజకీయ సమీకరణాలు వేగం పుంజుకున్నాయి. పలువురు మాజీ పదాధికారులు, యువ నాయకులు పోటీకి సిద్ధమవుతుండగా, సంఘాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ప్రధాన అజెండాగా మారనున్నట్లు చేనేత వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోని ఆరు సంఘాల్లో రానున్న రోజుల్లో ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.

Next Story