అక్రమ వెంచర్‌‌కు అధికారుల అండ..!

by Kodari Anjali |

బడంగ్‌‌పేట్‌ సర్కిల్‌ పరిధిలో ఓ వెంచర్‌ కూల్చివేత విషయంలో అధికారులు విమర్శలను మూటగట్టుకుంటున్నారు.

అక్రమ వెంచర్‌‌కు అధికారుల అండ..!
X

దిశ, బడంగ్‌ పేట్‌: బడంగ్‌ పేట్‌ సర్కిల్‌ పరిధిలో ఓ వెంచర్‌ కూల్చివేత విషయంలో అధికారులు విమర్శలను మూటగట్టుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు తూతూమంత్రంగా కూల్చివేతలు చేపట్టి మమ అనిపించారు. అక్రమం అన్నాక.. అన్ని నిర్మాణాలను పూర్తిస్థాయిలో కూల్చివేయాల్సింది పోయి.. ‘టచ్‌’ చేసి వదిలేసిన అధికారుల తీరుపై స్థానికులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బడంగ్‌ పేట్‌ కార్పోరేషన్‌ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు వెలుగు జూడడం.. పది మంది అధికారులపై వేటు పడ్డాక కూడా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తీరు మార్చుకోక పోవడం విస్మయం గొలుపుతోంది. అక్రమ వెంచర్‌ వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే కూల్చివేతలకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. నేతల తప్పిదాలకు గతంలో అధికారులు బలి పశువులు అయిన సందర్భాలు ఉన్నప్పటికీ.. అధికారులు గుణపాఠాలు నేర్చుకోక పోవడం పట్ల స్థానికుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పైపైనే కూల్చివేతలు...

బాలాపూర్‌ లోని సర్వే నెంబర్‌ 9, 10లలో దాదాపు 2 ఎకరాలకు పైగా స్థలంలో భారీ వెంచర్‌ ను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. సరికదా.వెంచర్‌ చుట్టూ ప్రీ కాస్ట్ వాల్‌ ను ఏర్పాటు చేసి అభివృద్ది పనులను చేపట్టారు. రోడ్లు వేయడంతోపాటు అండర్‌ డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్‌ స్తంభాల వంటి వాటిని చేపట్టారు. దీనిపై అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ కొంతకాలం పాటు అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. అక్రమ వెంచర్‌ పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తప్పని పరిస్థితుల్లో అధికారులు అక్రమ వెంచర్‌ పై చర్యలకు ఉపక్రమించారు. నెల రోజుల క్రితం వెంచర్‌ స్థలానికి వెళ్లిన అధికారులు తూతూమంత్రంగా రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాన్ని, ఒకటి రెండు విద్యుత్‌ స్తంభాలను కూల్చివేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో కూల్చివేతలు చేపడతారని అంతా భావించారు. కానీ..ఆతర్వాత అధికారులు అటు వైపు కన్నెత్తి సైతం చూడలేదు. చుట్టూత ఏర్పాటు చేసిన ప్రీ కాస్ట్ వాల్‌ నిర్మాణాన్ని సైతం ముట్టకోనూ లేదు. విద్యుత్‌ స్తంభాలు, డ్రైనేజీ నిర్మాణాలు యథావిధిగానే ఉన్నాయి.

ఆ ప్లాట్లకు అనుమతుల సంగతేంటీ!

అధికారులు కూల్చివేసిన సర్వే నెంబర్‌ 9,10లోని వెంచర్‌ అక్రమం అని తెలిసినప్పటికీ అందులో కొన్ని ప్లాట్లకు ఇంటి అనుమతులు ఇచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడి అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్​‍‌లు చేపట్టిన విచారణలోనూ ఇంటి అనుమతుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఇదే సందర్భంలో బాలాపూర్‌ అక్రమ వెంచర్‌‌లోని కొన్ని ప్లాట్లకు అనుమతులు ఇచ్చారని తెలుస్తుండడంతో ఇక్కడి అధికారుల బరితెగింపు అంశం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఏదిఏమైనా బడంగ్‌ పేట్‌ కార్పొరేషన్‌ అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినప్పటికీ.. ఇక్కడి అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకోక పోగా.. అక్రమాలకు వత్తాసు పలుకుతుండడం పట్ల స్థానిక ప్రజానీకం అసహనం వ్యక్తం చేస్తోంది.

Next Story