వైఎస్ షర్మిల పోటీ చేసేది ఆ నియోజకవర్గం నుంచే..!

by  |

దిశ ప్రతినిధి, ఖమ్మం : తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుకు సంబంధించి కార్యాచరణ దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగసభలో పార్టీ పేరును సైతం ప్రకటిస్తారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి షర్మిల టీం ముఖ్యుల్లో ఒకరైన కొండా రాఘవరెడ్డి ఆదివారం ఖమ్మం వచ్చి ఏర్పాట్లు కూడా పరిశీలించారు. అయితే షర్మిల పార్టీకి సంబంధించి పేరు, విధివిధానాలు ఇంకా పూర్తికాకముందే ఆమె అభిమానులు కొందరు 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గతంలో కోరారు. మంగళవారం జరిగిన సమావేశంలో కొందరు అభిమానులు పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిలకు సూచించిగా త్వరలోనే నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ షర్మిల పోటీచేసేది పాలేరా..? లేక ఖమ్మమా? ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే బాగుంటుందనే చర్చ రాజకీయవర్గాల్లో అప్పుడే జోరందుకుంది.

ఖమ్మం నుంచి పోటీచేస్తే..

ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొదట కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుపొంది తర్వాత వైఎస్ఆర్ సీపీలో ఉన్నవారే. జగన్ పార్టీలో చేరిన తర్వాతే అజయ్ తన క్యాడర్ ను బలోపేతం చేసుకున్నారు. ఈ క్రమంలో షర్మిల ఖమ్మం నుంచి పోటీ చేస్తేనే కొంత ఆశాజనకంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు సైతం షర్మిల పార్టీవైపు మళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అధికార పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతలు ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నా, కమలం పార్టీకి ఖమ్మంలో క్షేత్రస్థాయిలో పట్టులేదు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీని బీజేపీ ఢీ కొడుతుందా..? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీలకతీతంగా రాజశేఖర్ రెడ్డిని అభిమానించేవారు ఇప్పటికీ ఉన్నారు. ఖమ్మం నియోజవర్గం వ్యాప్తంగా ఆయనను పూజించేవారూ కనిపిస్తారు. వీరంతా షర్మిలకు మద్దతు తెలుపవచ్చని అంచనా.

కాంగ్రెస్‌కు కంచుకోట పాలేరు..

పాలేరు నియోజకవర్గం మొదటి నుంచీ కాంగ్రెస్ కు కంచుకోట. వైఎస్ కేబినెట్​లో మంత్రిగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీకి ఇప్పటికీ అక్కడ పట్టుంది. ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గెలిచింది కూడా కాంగ్రెస్ తరఫునే. దీంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఆదివారం ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు షర్మిలకు సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా ఉన్న రాజశేఖర్ రెడ్డి అభిమానుల వల్ల షర్మిలకు ఈ నియోజకవర్గం కూడా బాగానే ఉంటుందంటున్నారు.

కలిసిరానున్న ఆధిపత్య పోరు..

ఖమ్మం, పాలేరు రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఎప్పటి నుంచే నడుస్తోంది. ఖమ్మంలో పొంగులేటి, అజయ్, తుమ్మల, నామా ఇలా ఎవరి వర్గాలు వారికున్నాయి. పాలేరు నియోజకవర్గంలో కూడా తుమ్మల, కందాల వర్గాల మధ్య వార్ నడుస్తోంది. ఒకే పార్టీలో ఉన్న పాత, కొత్త కార్యకర్తల మధ్య అభిప్రాయభేదాలు, ఆధిపత్య పోరే. ఈ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి షర్మిల పోటీకి ఎంతో కలిసొస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.

పెద్ద నేతలు చేరితే..

ఉమ్మడి ఖమ్మం జిల్లా్వ్యాప్తంగా షర్మిల టీం ప్రధాన పార్టీల్లోని పెద్ద నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు పరోక్షంగా మద్దతిస్తుంటామని, సమయాన్ని బట్టి పార్టీలో చేరతామని కూడా కొంత మంది నేతలనుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. అయితే 2023 ఎన్నికల నాటికి రెండు నియోజకవర్గాల నుంచి పెద్ద నేతలు చేరితే ఇక జిల్లాలో ఆమె పార్టీకి తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు సునాయసమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

రెండు నియోజకవర్గాల్లోనూ పట్టున్న నేతలే..

రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు మంచి పట్టుందని, ఈ నియోజకవర్గాలు షర్మిలకు శ్రేయస్కరం కాదని మరికొందరుంటున్నారు. రెండు నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉండడం, వారంతా అధికార పార్టీలోనే ఉండడంతో వేరే పార్టీనుంచి వచ్చి ఈ స్థానాల్లో పోటీచేయడం అంత సులువైన పనికాదనేది మరికొందరి వాదన. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని పలువురు పేర్కొంటున్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story