ఢిల్లీకిపోయి పొడుస్తా అన్నావ్‌గా కేసీఆర్.. కిరికిరి చాలంటూ షర్మిల ఫైర్

by  |
YS Sharmila
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అకాల వర్షానికి వడ్లు తడిచి కళ్లాల్లోనే మొలకెత్తుతున్నాయి. ఇది చూసిన రైతులు వరి కుప్పల మీదే ప్రాణాలు వదిలేస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనే బాధ్యత కేంద్రానిదేనని సీఎం కేసీఆర్ చెప్పి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను ఒప్పించి యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత తీసుకొస్తామని ఢిల్లీకి వెళ్లారు. అయితే, మూడు రోజుల తర్వాత సీఎం కేసీఆర్ బుధవారం మళ్లీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రధానిని కలవకుండానే వెనుదిరగడంతో కేసీఆర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘3గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పిన KCR కథ.. 3ఏండ్లు కర్రసాము నేర్చి మూలకున్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరు అయింది. ఢిల్లీకి పోయి పొడుస్తమ్ అని ప్రెస్ మీట్‌లు పెట్టిన దొర ఉత్తి చేతులతో తిరిగొచ్చాడు. అపాయింట్‌మెంట్ లేకుండానే ఏం పొడుస్తారని పోయారు. ఒక పక్క రైతులు కల్లాల్లో ధాన్యం పెట్టుకొని, వర్షానికి తడుస్తూ గుండెలు చెరువై కుప్పలపైనే ప్రాణాలు విడుస్తుంటే, మీ హుజురాబాద్ ఓటమిని జనాలు మర్చిపోవాలని, వరి కిరికిరి అని ధర్నా డ్రామాలతో ఢిల్లీ తీర్థ యాత్రలకు పోయింది చాలు. యాసంగి పక్కన పెట్టి కల్లాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనండి.’’ అని ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed