జీవో 38 అమలు చేయకుంటే వైద్య సేవలు బంద్‌.. ప్రభుత్వానికి వైద్యుల వార్నింగ్‌

by Ramesh Naini |

బదిలీల్లో వైద్యుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపి వేస్తామని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

జీవో 38 అమలు చేయకుంటే వైద్య సేవలు బంద్‌.. ప్రభుత్వానికి వైద్యుల వార్నింగ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: బదిలీల్లో వైద్యుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపి వేస్తామని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) ప్రభుత్వాన్ని హెచ్చరించింది. జీవో నెం.38 నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు టీజీజీడీఏ రాష్ట్ర కార్యవర్గ పదాధికారులు ఎవరూ బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ఫారాలను సమర్పించబోరని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గురువారం అత్యవసర సమావేశం నిర్వహించి, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వైద్యుల బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 38 నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ జీవో 38 లో పేర్కొన్న అన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా స్పౌస్ (భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించే) ప్రమాణాలను, అలాగే ఇతర ప్రాధాన్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైద్యులు సమర్పించిన రిక్వెస్ట్ బదిలీలు

వైద్యులు సమర్పించిన రిక్వెస్ట్ బదిలీలను తక్షణమే మంజూరు చేయాలని, గుర్తింపు పొందిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ప్రభుత్వం జీవో 38 ను పూర్తిగా అమలు చేయకపోయినా, వైద్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోయినా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయడానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, వెంటనే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లల్లు ప్రసాద్ రాథోడ్, రాష్ట్ర ట్రెజరర్ డాక్టర్ రౌఫ్, ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బొంగు రమేష్, సెక్రటరీ జనరల్ డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ మురళీధర్, డాక్టర్ భూపేందర్ రాథోడ్, డాక్టర్ సిద్దిక్, డాక్టర్ సంతోష్ బాబు, డాక్టర్ ఎం. శ్రీనివాస్, డాక్టర్ రజనీకాంత్, డాక్టర్ రాధాకిషన్, డాక్టర్ వినోద్, డాక్టర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story