ఈ ఫీచర్‌కు గుడ్‌బై చెబుతున్న యూట్యూబ్!

by  |
ఈ ఫీచర్‌కు గుడ్‌బై చెబుతున్న యూట్యూబ్!
X

యూట్యూబ్ ప్రారంభం నుంచి అందుబాటులో ఉన్న ఒక ఫీచర్‌కు ఆ సంస్థ సెప్టెంబర్‌లో గుడ్‌బై చెప్పబోతోంది. కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేయడమేగానీ ఉన్న ఫీచర్లను తొలగించే అలవాటు సాధారణంగా గూగుల్ ఉత్పత్తులకు ఉండదు. అది అనవసరంగా మారితే తప్ప సంబంధిత ఫీచర్‌ను గూగుల్ తొలగించదు. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన యూట్యూబ్‌లో ఎన్నాళ్లుగానో పెద్దగా వాడకంలో లేని ఫీచర్‌ను సెప్టెంబర్‌లో తొలగించనుంది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటి? అనుకుంటున్నారా?.. యూట్యూబ్‌లో అన్ని వీడియోలు మనకు అర్థమయ్యే భాషలో ఉండవు కదా.. అవి అర్థం కావడానికి ఆయా భాషల్లో గానీ, ఇంగ్లిషులో గానీ క్యాప్షన్లు అవసరం. వీడియో పెట్టినవాళ్లు అన్ని భాషల్లో క్యాప్షన్లు పెట్టలేరు కాబట్టి ‘కమ్యూనిటీ క్యాప్షన్స్’ అని యూట్యూబ్‌లో ఒక ఆప్షన్ ఉంది.

ఈ ఆప్షన్ ద్వారా వీడియో చూసిన వారెవరైనా తమ గూగుల్ ఖాతాతో లాగిన్ అయ్యి, వీడియోలకు క్యాప్షన్లు రాయొచ్చు. అయితే ఇప్పటివరకు దీన్ని చాలా తక్కువ మంది ఉపయోగించుకున్నారు. గత నెలలో అయితే కేవలం 0.001 శాతం మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకున్నారు. అందుకే ఇలా వినియోగంలో లేని ఫీచర్‌ను సెప్టెంబర్ 28న తొలగిస్తున్నట్లు యూట్యూబ్ తమ బ్లాగ్‌లో పేర్కొంది. ఈ ఫీచర్ లేకపోయినప్పటికీ సొంత క్యాప్షన్లు పెట్టుకోవడం, ఆటోమేటిక్ ఇంగ్లీష్ క్యాప్షన్ల ఫీచర్‌తో పాటు ఇతర థర్డ్ పార్టీ టూల్స్ ఉపయోగించి సబ్‌టైటిల్స్ పెట్టుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ఫీచర్ తీసివేయడం వల్ల వినికిడి లోపం ఉన్న వాళ్ల కోసం రూపొందించిన వీడియోలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు యూట్యూబర్లు విమర్శిస్తున్నారు. వినికిడి సమస్య ఉన్నవారి కోసమే ప్రత్యేకంగా కంటెంట్ రూపొందించే యూట్యూబర్ రిక్కీ పాయింటర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ప్రత్యేకంగా క్యాప్షన్ల కోసం థర్డ్ పార్టీకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోందని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు కమ్యూనిటీ క్యాప్షన్ల పేరుతో తప్పుడుగా, బూతులతో ఉన్న క్యాప్షన్లను కొంతమంది ఆకతాయి యూజర్లు అప్‌లోడ్ చేసి వీడియోల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని కొందరు యూట్యూబర్లు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed