​సైబర్ కేటుగాళ్ల మాయాజాలం.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన మెసేజ్ !

by Batti.Sumithra |

సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు విసిరిన ఒకే ఒక్క లింక్.. ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది.

​సైబర్ కేటుగాళ్ల మాయాజాలం.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన మెసేజ్ !
X

దిశ, హుజురాబాద్ రూరల్ : సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు విసిరిన ఒకే ఒక్క లింక్.. ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. "నీ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ వల్లే నా డబ్బులు మాయమయ్యాయి.. నా డబ్బులు నాకు ఇచ్చేయ్" అంటూ ఒకరు, "నేను ముందే హెచ్చరించాను కదా.. నేనెందుకు ఇస్తాను" అంటూ మరొకరు గొడవకు దిగడంతో వ్యవహారం కాస్తా గ్రామ పంచాయితీకి చేరింది. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే..?

​గ్రామస్తుల కథనం ప్రకారం.. తుమ్మనపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటెడ్ ఉద్యోగి బాపురెడ్డి వాట్సాప్‌ నంబరుకు మూడు రోజుల క్రితం ‘ఆర్టీఏ ఈ చలాన్’ పేరిట ఒక మెసేజ్ వచ్చింది. అది నిజమైనదేనని నమ్మి ఆయన దాన్ని ఓపెన్ చేయగా, వెంటనే ఓటీపీలు అడగడం ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చిన బాపురెడ్డి.. వెంటనే తన సన్నిహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. నీ ఫోన్ హ్యాక్ అయిందని, వెంటనే వాట్సాప్ డిలీట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని ఆ స్నేహితుడు సూచించాడు.

​అయితే, ఈ లోపే బాపురెడ్డి ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్న సుమారు 560 మందికి ఆ లింక్ ఆటోమేటిక్‌గా ఫార్వార్డ్ అయిపోయింది. విషయం గ్రహించిన బాపురెడ్డి.. తన పిల్లల సహాయంతో "నా ఫోన్ హ్యాక్ అయింది, నా నంబర్ నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్‌లను ఓపెన్ చేయకండి" అని కాంటాక్ట్ లో ఉన్న వారందరికీ సమాచారం అందించాడు.

హెచ్చరించినా ఓపెన్ చేసి..

​ఇదే గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి అనే వ్యక్తికి కూడా ఆ మెసేజ్ వెళ్ళింది. దేవేందర్ రెడ్డి ఫోన్ చేసి అడగ్గా.. బాపురెడ్డి తాను సైబర్ బారిన పడ్డానని, ఆ మెసేజ్ ఓపెన్ చేయవద్దని స్పష్టంగా చెప్పాడు. దానికి దేవేందర్ రెడ్డి కూడా సరేనన్నాడు. ​కానీ, ఏమైందో ఏమో కానీ.. మూడు రోజుల తర్వాత దేవేందర్ రెడ్డి, బాపురెడ్డి వద్దకు వచ్చి గొడవకు దిగాడు. "నీ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేయడం వల్లే నా బ్యాంక్ ఖాతాలో నుంచి రూ. 12,600 కట్ అయ్యాయి.. ఆ డబ్బును నువ్వే బాధ్యత వహించి నాకు తిరిగి ఇచ్చేయాలి" అని డిమాండ్ చేశాడు. తాను ముందే హెచ్చరించానని, డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని బాపురెడ్డి తెగేసి చెప్పాడు.

​పంచాయితీ మెట్లెక్కిన వివాదం..

​ఈ వివాదం కాస్తా ముదరడంతో దేవేందర్ రెడ్డి ఉదయాన్నే గ్రామ పంచాయితీ వద్దకు బాపురెడ్డిని పిలిపించి పంచాయితీ పెట్టించాడు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై బాపురెడ్డి స్పందిస్తూ.. "నీ బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకురా.. అందులో నా ఖాతాకే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్టు ఉంటే నేను నీ డబ్బులు ఇచ్చేస్తా. లేదంటే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టుకో" అని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ల మోసాల వల్ల గ్రామంలో ఇద్దరి మధ్య ఇలా చిచ్చు రేగడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను, చలాన్ల మెసేజ్‌లను క్లిక్ చేయవద్దని, ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని పోలీసులు సమావేశాల్లో హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మోసపోతే వెంటనే '1930' నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం శోచనీయం.

Next Story