- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమీర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. పక్క షాప్‍లకు అంటుకుంటున్న మంటలు
హైదరాబాద్ అమీర్‌పేట మెట్రో పిల్లర్ 1043 వద్ద కేఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‍లో అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైత్రీవనం, స్వర్ణజయంతి కాంప్లెక్స్ ఎదురువైపున ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మెట్రో పిల్లర్ నంబర్ 1043కి సరిగ్గా సమీపంలో ఉన్న ఈ భవనంలో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి దగ్ధమైంది. ఈ భవనంలోని మొదటి, రెండు అంతస్తుల్లో ఉన్న దుకాణాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం మూడు అంతస్తుల్లో ఉన్న సుమారు 20 షాపులు కాలిపోయాయి. కాంప్లెక్స్‌లో ఎక్కువగా బట్టల దుకాణాలు ఉండటం వల్ల మంటల తీవ్రత చాలా వేగంగా పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దట్టమైన పొగ మైళ్ల దూరానికి కనిపించడంతో చుట్టుపక్కల భవనాల్లోని ప్రజలు, వ్యాపారులు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన భవనంలో 10 ట్రావెల్స్ ఆఫీసులు, 5 కోచింగ్ సెంటర్లు ఉన్నట్లు సమాచారం.
స్తంభించిన ట్రాఫిక్.. సిటీ బస్సులు నిలిపివేత
అమీర్‌పేట మెట్రో స్టేషన్‌కు కేవలం 100 అడుగుల దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం కారణంగా అమీర్‌పేట రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆయా మార్గాల్లో నడిచే సిటీ బస్సులను ట్రాఫిక్ పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
తప్పిన ప్రాణనష్టం
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మైత్రివనంలోని నీలగిరి బ్లాక్‍లో ఓ ఇన్ స్టిట్యూట్‍లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన జరిగిన నెలల వ్యవధిలోనే మళ్లీ ఇదే ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపుతోంది.






