- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధులు, యువతకు మధ్య ‘ఇంటర్‌జనరేషన్ ఫ్రెండ్‌షిప్’
<p>దిశ, ఫీచర్స్ : రెండో బాల్యంగా చెప్పుకునే ‘వృద్ధాప్యం’ వరం కావాలి గానీ శాపంగా మారుతోంది. తనయులకు మార్గదర్శనం చేసిన ఆ పెద్దరికం నేడు ఆధారం కోల్పోతోంది. రాబోయే తరాలకు దిశానిర్దేశం చేస్తూ బంధాల విలువను, అనుభవాల సారాన్ని పంచుకోవాల్సిన వారు.. చిరునామాలేని ఉత్తరాలై, మోడుబారిన చెట్ల వలె భారంగా కాలాన్ని వెల్లదీస్తున్నారు. చీదరింపులు, ఈసడింపులతో ఇంట్లోనూ ‘అనాథ’ల్లా బతుకీడుస్తున్న ఆ పండుటాకులకు కావాల్సింది ఆకాశమంత ఆప్యాయత కాదు, గుప్పెడంత ప్రేమ. ఆ గుండెల్లో జీవం నింపడానికి, […]</p>

దిశ, ఫీచర్స్ : రెండో బాల్యంగా చెప్పుకునే ‘వృద్ధాప్యం’ వరం కావాలి గానీ శాపంగా మారుతోంది. తనయులకు మార్గదర్శనం చేసిన ఆ పెద్దరికం నేడు ఆధారం కోల్పోతోంది. రాబోయే తరాలకు దిశానిర్దేశం చేస్తూ బంధాల విలువను, అనుభవాల సారాన్ని పంచుకోవాల్సిన వారు.. చిరునామాలేని ఉత్తరాలై, మోడుబారిన చెట్ల వలె భారంగా కాలాన్ని వెల్లదీస్తున్నారు. చీదరింపులు, ఈసడింపులతో ఇంట్లోనూ ‘అనాథ’ల్లా బతుకీడుస్తున్న ఆ పండుటాకులకు కావాల్సింది ఆకాశమంత ఆప్యాయత కాదు, గుప్పెడంత ప్రేమ. ఆ గుండెల్లో జీవం నింపడానికి, ఆ కళ్లల్లో ఆనందం ఉప్పొంగడానికి కావాల్సింది నలుగురు వ్యక్తుల ఓదార్పు కాదు, కాసిన్ని మాటలు. కానీ జీవితాన్ని కాచి వడపోసిన మహాజ్ఞానులతో ఈ తరానికి దూరం పెరిగిపోతోంది. ఈ కథ ఏ ఇంటికో, ఊరికో పరిమితం కాదు.. ఇది ‘ఇంటింటి రామాయణం, కన్నీటి పారాయణం’. అయితే మలి వయసులో మహా వేదన అనుభవిస్తున్న ముసలి ప్రాణాలకు మేమున్నామంటూ ముందుకొచ్చింది ‘గుడ్ ఫెలోస్’. అపార అనుభవం, అవధుల్లేని ప్రేమకు ప్రతిరూపాలైన సీనియర్స్‌కు సేవలందిస్తోంది. అవేంటో మీరూ తెలుసుకోండి..
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వృద్ధుల సంఖ్య సుమారు 11 కోట్లు. 2050 నాటికి ఈ సంఖ్య 32 కోట్లకు మించిపోతుందని అంచనా. ఇలాంటి తరుణంలో సీనియర్ సిటిజన్స్‌కు కావాల్సింది ఆశ్రమాలు కాదు మేమున్నామనే భావన. వృద్ధుల యుటిలిటీ అవసరాలను తీర్చుకునేందుకు మార్గాలను కనుగొన్నప్పటికీ, ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ వారిని కుంగదీస్తోంది. రెక్కలొచ్చాక తమ ఆకాంక్షల్ని వెతుక్కుంటూ వెళ్లిపోయిన కుమారులు లేదా తమతో గడిపేంత తీరికలేని కుటుంబాల కారణంగా వృద్ధుల భావోద్వేగాలకు స్థానం లేకుండా పోయింది. బిజీ లైఫ్ వల్ల తల్లిదండ్రుల బాగోగులను దగ్గరుండి చూసుకోలేని పిల్లలు అందుకోసం వైద్యులు, నర్సులు, కేర్‌టేకర్స్‌ను నియమించినా పేగుబంధానికి అది ప్రత్యామ్నాయం చూపదు. ఆ ఒంటరితనమే వృద్ధుల్లో తీవ్ర మానసిక, శారీరక సమస్యలను తెచ్చిపెడుతోంది. తల్లిదండ్రులను పోషించే బాధ్యత పిల్లలదేనని కోర్టులు, చట్టాలు చెబుతున్నా అవి కొటేషన్స్‌కే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వారి ఒంటరితనాన్ని దూరం చేసి యువతరానికి, వృద్ధులకు మధ్య స్నేహాన్ని ఏర్పరిచేందుకు ‘గుడ్ ఫెలోస్’ కృషి చేస్తోంది. ఇది లాభాపేక్షతో కూడిన స్టార్టప్ కాగా, ఇందులో వృద్ధులకు తోడుగా ఉండేందుకు 30 ఏళ్ల వయసున్న యువ, విద్యావంతులైన గ్రాడ్యుయేట్లను నియమిస్తారు. ఇండియన్ బిజినెస్ టైకూన్ రతన్ టాటా దగ్గర బిజినెస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శంతను నాయుడు దీన్ని స్థాపించాడు.
ఇంటర్‌జనరేషన్ ఫ్రెండ్‌షిప్
ఒంటరి వృద్ధులకు ‘గుడ్‌ఫెలోస్’ అందిస్తున్న సహచర్యం.. అర్థవంతమైన, ప్రామాణికమైన మార్గం. అనేక సైకోమెట్రిక్ పరీక్షల ద్వారా వృద్ధుల మానసిక పరిస్థితిని అంచనా వేసి, వారికి మ్యాచ్ అయ్యే ఓ గుడ్‌ఫెలోని సంస్థ కేటాయిస్తుంది. ఒకసారి జత చేసిన తర్వాత సదరు గుడ్‌ఫెలో(అతను/ఆమె).. తమ సొంత తాతయ్య కోసం చేసే ప్రతీ పనిని చేస్తాడు. వాకింగ్‌కు తీసుకెళ్లడం, సినిమాలు చూడటం, కిరాణా షాపింగ్‌లో సాయపడటం, డాక్టర్‌ను కలవడం, సాంకేతికతను బోధించడం, రాతపని సహా ఈ-మెయిల్ చెకింగ్ వంటి పనులన్నీ చేస్తారు. అంతేకాదు వారితో (తాతయ్య/అమ్మమ్మ/నానమ్మ) కబుర్లు చెప్తూ కాలక్షేపం కూడా చేస్తారు. కాగా వృద్ధుల ఒంటరితనాన్ని ‘ఇంటర్‌జనరేషన్ ఫ్రెండ్‌ఫిష్’ ప్రభావవంతంగా పరిష్కరిస్తుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. గుడ్ ఫెలోస్ స్టార్టప్ పెద్దల అవసరాలకు అనుగుణంగా సాధ్యమయ్యే పనుల జాబితాను ఓపెన్-ఎండ్‌గా ఉంచుతోంది. వృద్ధుల వినియోగ అవసరాలను తీర్చడానికి అనేక స్టార్టప్స్ వస్తున్నప్పటికీ ‘కంపానియన్‌షిప్’ మాత్రం అందించడం లేదు. సాంగత్యం మాత్రమే కాదు గ్రాండ్ పేరెంట్స్ పట్ల సానుభూతితో కూడిన అవగాహన కూడా అవసరం. ఆ విషయంలో గుడ్‌ఫెలోస్ విజయం సాధిస్తోంది.
‘గుడ్‌ఫెలోస్’ సేవలు ప్రస్తుతం బీటా వెర్షన్‌లోనే ఉండగా.. ఇప్పటికే దీన్ని ఉపయోగిస్తున్నవారు చాలా ఆనందంగా ఉన్నారు. జనవరి నుంచి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో ఈ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నాం. యంగ్ గ్రాడ్యుయేట్స్‌కు కూడా ఉపాధి దొరుకుతుండటం వల్లే దీన్ని డబ్బులు చెల్లించే ప్లాట్‌ఫామ్‌గా మార్చాం. ఆర్థిక సమస్యలతో సతమవుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరం. గ్రాండ్ పేరెంట్స్, గ్రాడ్యుయేట్స్.. ఇది ఇరువురికీ లాభం చేకూరుస్తుంది. పెయిడ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగులుగా ఉండటంతో.. ప్రతీసారి కొత్తవారిని పంపే బదులు గతంలో వారి నమ్మకాన్ని ఏర్పరచుకున్న అదే గుడ్‌ఫెలోను అందించడం సాధ్యమవుతుంది. పెద్దల ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుని ఉచిత సేవలు కూడా అందిస్తాం. కొన్నేళ్లుగా వృద్ధుల పట్ల ఆప్యాయతతో పాటు మిస్టర్ రతన్ టాటాతో నాకున్న ‘ఇంటర్‌జనరేషన్ ఫ్రెండ్‌షిప్’ ప్రయోజనాలే ఈ స్టార్టప్ ప్రారంభించేలా ప్రేరేపించాయి.
– శంతను నాయుడు, గుడ్ ఫెలోస్ ఫౌండర్






