- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. ఇకపై జీరో టాలరెన్స్: సీఎం చంద్రబాబు
ఏపీలో డ్రగ్స్ మాఫియాపై సీఎం చంద్రబాబు ఉక్కుపాదం.. ఇకపై జీరో టాలరెన్స్.. ఆ చీకటి రోజులు గతంగా మారిపోయాయంటూ ట్వీట్!

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. “మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” సందర్భంగా ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనం చేసే ఈ పోరాటం అంతిమంగా మన యువత భవిష్యత్తు, వారి ఆరోగ్యం, వారి కలలను కాపాడే ఒక యుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వేళ్లూనుకుపోయిన ఆ పాత చీకటి రోజులు ఇప్పుడు గతంగా మారిపోయాయని స్పష్టం చేసిన చంద్రబాబు.. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై తమ ప్రభుత్వం కనికరం లేకుండా ఉక్కుపాదం మోపుతుందని, ఈ రవాణాకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు, డ్రగ్స్ మహమ్మారి బారిన పడి వ్యసనంతో పోరాడుతున్న బాధితుల పట్ల సీఎం మానవీయ కోణంలో స్పందించారు. వ్యసన విముక్తి కోసం తపించే వారికి ప్రభుత్వం తరఫున సాధ్యమైన అన్ని విధాలా పునరావాస సహాయ సహకారాలు అందిస్తామని, వారు సమాజంలో గౌరవప్రదంగా కోలుకుని మళ్లీ సరికొత్త జీవితాన్ని నిర్మించుకునేలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించి, ప్రతి కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్తును, నూతన ఆశలను అందించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






