- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి!
రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం ఒక సరికొత్త, వినూత్న నిర్ణయం తీసుకోబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త, వినూత్న నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై రాష్ట్రంలో జరిగే వివాహాల శుభలేఖలపై (Wedding Invitations) వధూవరుల పుట్టిన తేదీలను (Dates of Birth) ముద్రించడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే ఈ విషయాన్ని అసెంబ్లీలో వెల్లడించారు. ఈ నిబంధన వల్ల పెళ్లి సమయానికి వధూవరుల వయస్సును సులభంగా సరిచూసుకోవడానికి (Verify) వీలవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సరికొత్త విధానాన్నీ పక్కాగా అమలు చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. కేవలం తల్లిదండ్రులనే కాకుండా.. శుభలేఖలు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్‌లు, పెళ్లిళ్లు జరిపించే కల్యాణ మండపాలు, ఈవెంట్ ఆర్గనైజర్లను కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ బాధ్యులను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
రాజస్థాన్ మోడల్ ఆధారంగా..
గతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే రాజస్థాన్లో ఇటువంటి నిబంధనను తీసుకురావడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, అక్కడ బాల్య వివాహాలు అరికట్టడంలో ఇది ఎంతగానో సహాయపడిందని మంత్రి అదితి తట్కరే గుర్తుచేశారు. ఇప్పుడు అదే రాజస్థాన్ మోడలు మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. మహారాష్ట్ర రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అసెంబ్లీలో ప్రభుత్వం సమర్పించిన డేటా ప్రకారం.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహాలు జరుగుతున్న రేటు ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. ముఖ్యంగా బీడ్, మరాఠ్వాడా వంటి గ్రామీణ ప్రాంతాల్లో చెరకు నరకడానికి సీజనల్ వలసలు వెళ్లే కార్మికుల కుటుంబాల్లో ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ వలస కార్మికుల్లో అవగాహన పెంచడంతో పాటు, వారి పిల్లల రక్షణ కోసం చైల్డ్ కేర్ సెంటర్లను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్న చర్యల వల్ల బాల్య వివాహాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోందని, 2025-26 ఏడాదిలోనే దాదాపు 1,434 బాల్య వివాహాలను అధికారులు విజయవంతంగా అడ్డుకున్నారని మంత్రి వివరించారు.






