రెబ్బెన పోలీసుల చాకచక్యం.. 24 గంటల్లోనే లభ్యమైన విద్యార్థిని ఆచూకీ!

by Jakkula.Mamatha |

రెబ్బెన మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని అదృశ్యమైన కేసును రెబ్బెన పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు.

రెబ్బెన పోలీసుల చాకచక్యం.. 24 గంటల్లోనే లభ్యమైన విద్యార్థిని ఆచూకీ!
X

దిశ, రెబ్బెన: రెబ్బెన మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని అదృశ్యమైన కేసును రెబ్బెన పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. విద్యార్థిని క్షేమంగా లభించడంతో కుటుంబ సభ్యులు, గురుకుల సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని అదృశ్యమైన విషయం తెలియగానే రెబ్బెన సీఐ సంజయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు నిర్వహించారు. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం, వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టడంతో విద్యార్థిని ఆచూకీ త్వరితగతిన గుర్తించినట్లు రెబ్బెన ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపారు.

విద్యార్థిని క్షేమంగా లభించిన అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలను చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థిని అదృశ్యానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, ఆమె నుంచి పూర్తి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించడంలో పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయడం ఫలితమని పేర్కొన్నారు. విద్యార్థిని సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించిన రెబ్బెన పోలీసుల వేగవంతమైన స్పందనపై మండల ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేశారు.

Next Story