- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సులో బంగారు గొలుసు చోరీ కేసు ఛేదన.. ప్రధాన నిందితుడు అరెస్ట్, మరో ముగ్గురు పరారీలో!
ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని బస్సుల్లో బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు వేగంగా స్పందించి కీలక పురోగతి సాధించారు.

దిశ,చంపాపేట్: ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని బస్సుల్లో బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు వేగంగా స్పందించి కీలక పురోగతి సాధించారు. చోరీకి గురైన 2.5 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 23న లాలాజార్ క్రాస్ రోడ్ బస్ స్టాప్ వద్ద నుంచి 72జే టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గట్టు సీతారామారావు (61) అనే వ్యక్తి తీవ్ర రద్దీ కారణంగా ఫుట్‌బోర్డు సమీపంలో నిలబడ్డారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు కావాలనే ఆయనను చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆయన మెడలో ఉన్న సుమారు 2.5 తులాల బంగారు గొలుసును అపహరించి పరారయ్యారు.
యశోద ఆసుపత్రి వద్దకు చేరుకున్న తర్వాత గొలుసు కనిపించకపోవడంతో బాధితుడు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి నిందితుడిని మల్లేపల్లి మంగర్‌బస్తీకి చెందిన పాత ఆస్తి నేరస్థుడు, ఆటో డ్రైవర్ కమ్లే రతన్ అలియాస్ రతన్ బాదల్ (42)గా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఉదయం మంగర్‌బస్తీ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, లాకెట్‌తో కూడిన 2.5 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో సల్మాన్, ఇస్మాయిల్, ఇబ్రహీం అనే మరో ముగ్గురు సహచరులతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసును చాకచక్యంగా ఛేదించి ఆస్తిని బాధితుడికి తిరిగి అందించే దిశగా చర్యలు తీసుకున్న దర్యాప్తు అధికారి ఎస్‌ఐ బి.కృష్ణారెడ్డి, ఇన్‌స్పెక్టర్ కె.బి. మురారి, డీఐ బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని పోలీసు బృందాన్ని ఏసీపీ ఎల్.రాజా వెంకట్ రెడ్డి, అదనపు డీసీపీ కె. ఎం.డి. మజీద్ పర్యవేక్షణలో చార్మినార్ జోన్ డీసీపీ అభినందించారు.






