సేంద్రియ పద్ధతిలో సాగు.. ఆదర్శంగా యువరైతు

by  |
సేంద్రియ పద్ధతిలో సాగు.. ఆదర్శంగా యువరైతు
X

దిశ, జగిత్యాల: వ్యవసాయ రంగం ప్రస్తుత సమయంలో అనేక ఆటుపోట్లు ఎదురుకుంటోంది. ఏది అభివృద్ధో, ఏది పతనమో అవగాహన లేమితో భూమి సాగు వనరులు నిస్పష్టంగా మారి భూమి సాగు సమస్యల వలయంగా మారుతుంది. నాణ్యత గల వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పుడు మంచి డిమాండ్ పెరుగుతుందని, సాంప్రదాయ వ్యవసాయానికి నీళ్లులోదిలి, నాసిరకం వ్యవసాయ ఉత్పత్తుల వైపు చూస్తున్నారని, అభ్యుదయ రైతులు అంటున్నారు. వ్యవసాయంలో రసాయనా లకు స్వస్తి చెప్పి నేల ఆరోగ్యాన్ని పెంచే వ్యవసాయ విధానాలు ఆచరించడమే కాక ఇతర రైతులకు తెలియజెప్పి తను చిన్న రైతే అయినా తన ఆశయాలు పెద్దవని చాటుతున్న యువకుడు సాగులో కొత్త దారులు వెతికాడు. ప్రకృతి వ్యవసాయం సేంద్రియ పద్ధతిలో ఐదు రకాల వరి వంగడాల సాగుపై అధ్యయనం చేశాడు. జగిత్యాల జిల్లా రేచపల్లి గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు డిగ్రీ పూర్తిచేసి.. పీజీ చదువుతూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు.

ఔషధ గుణాలు మెండుగా..

నవర, కులకర్, కలబట్టి, సిరి సన్నలు, రత్నచోడి.. దేశావళి వంగడాల సాగులో ప్రతిఫలాలు అందుకుంటున్న అశోక్ పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పంటలను సాగు చేస్తున్నాడు. రసాయనాలకు అలవాటు పడ్డ నేల కావడంతో తొలి ఏడాది తక్కువ పంట వచ్చిందని, రెండోసారి పంట బాగానే వచ్చిందని రైతు చెప్పాడు. ఈ కొత్త రకం పంటలపై వీడియోలు చిత్రీకరిస్తూ యూట్యూబ్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. యూట్యూబ్ ద్వారా తెలుసుకుని కావాల్సిన వారికి పోస్టల్ ద్వారా పంపిస్తున్నామని తెలిపారు.

వరిపంట రకాలు

1. నవార: ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రైస్‌ను ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా అంటారు. ఈ రైస్ యొక్క ప్రత్యేకత బియ్యం నుంచి కూడా మొలకలు వస్తాయి.

2. కుళ్లాకార్: ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది తింటే పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ రైస్‌లో మాంగనీసు, విటమిన్ బీ6, కాల్షియం, ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్స్, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి.

3. కాలాబట్టి, బర్మా బ్లాక్, మణిపూర్ బ్లాక్: ఇవి నలుపు రంగులో ఉంటాయి. ఈ రైస్ వల్ల క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల వంటి అనారోగ్యాల బారిన నుండి రక్షణ కల్పిస్తుంది.

4. సిరిసన్నలు, కుజిపాటలియా, సన్నజాజులు, చింతలూరు సన్నాలు, సిద్ధ సన్నాలు: ఇవి తెలుపు, సన్న రకాలు. ఈ బియ్యంలో కొవ్వు రహిత, సోడియం లేనివి. తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. గ్లూకోజ్ పదార్థాలు తక్కువగా ఉంటాయి. రోగనిరోధకశక్తి పెరగడానికి తోడ్పడతాయి.

5. రత్నచోడి: ఈ రైసు తెలుపు, సన్నరకం అధిక పోషక విలువలు ఉంటాయి. కండ పుష్టికి, శరీర సమతుల్యతకు ఉపయోగపడుతుంది. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా వాడే వారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వ్యవసాయం అంటే ఆసక్తి: అశోక్, రైతు, రేచపెల్లి
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీలో జాయిన్ అయ్యాను. వ్యవసాయంపై ఆసక్తితో రెండు సంవత్సరాలుగా ఈ పంటలు పండిస్తున్నా. రెగ్యులర్‌గా పండించే వరి రకాలు కాకుండా కొత్త రకాలు పండించాలనే ఆలోచనతో యూట్యూబ్‌లో వెతికి ఆంధ్ర ప్రదేశ్, వివిధ రాష్ట్రాల నుంచి విత్తనాలను దిగుమతి చేసుకున్నారు. ఐదు రకాల వరి సాగు చేస్తున్నాను. నల్ల రకం, రెండు ఎరుపు రకాలు, సిరి సన్నలు, రత్నజోడి రకాలు సాగు చేశా. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలతో పంటలు సాగు చేశాను.


Next Story

Most Viewed