రావిర్యాల చెరువు మింగేసిన ‘ఏక్ సాల్’ మాయ.. పట్టాదారులుగా సెలబ్రిటీలు!

by Naga Rani Yarlagadda |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సంబంధించి జన్వాడ కోడి చెరువు కింద శిఖం పట్టా భూముల వ్యవహారంతో.. రాష్ట్రవ్యాప్తంగా శిఖం, ఏక్ సాల్ పట్టాలపై కొత్త చర్చ మొదలైంది.

రావిర్యాల చెరువు మింగేసిన ‘ఏక్ సాల్’ మాయ.. పట్టాదారులుగా సెలబ్రిటీలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సంబంధించి జన్వాడ కోడి చెరువు కింద శిఖం పట్టా భూముల వ్యవహారంతో.. రాష్ట్రవ్యాప్తంగా శిఖం, ఏక్ సాల్ పట్టాలపై కొత్త చర్చ మొదలైంది. నిబంధనల ప్రకారం పవన్ కొన్న భూమిలో సాగుకు మాత్రమే ఆస్కారం ఉంది. నిర్మాణాలకు అనుమతి లేదు. అయితే రాష్ట్రంలో ఇలాంటి శిఖం, ఏక్ సాల్ పట్టాలు ఇంకెక్కడా లేవా? ఉంటే అవి ఇప్పుడు రికార్డుల్లో ఎందుకు కనిపించడం లేదు? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల చెరువు ఆక్రమణల బాగోతాన్ని గమనిస్తే.. ఏక్ సాల్ పట్టాలు కాస్త పక్కా పట్టాలుగా ఎలా మారాయో అర్థమవుతుంది.

ఏక్ సాల్ పట్టాల మాయాజాలం

రావిర్యాల చెరువు ఒకప్పుడు 1200 ఎకరాలు. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంతసమీపంలో ఉన్న ఈ చెరువు కాలక్రమంలో 884 ఎకరాలకు కుచించుకుపోయింది. ఇప్పుడు పీఓటీ జాబితాలో కేవలం 136 ఎకరాలు మాత్రమే చూపిస్తున్నది. నాలాలు మాయమయ్యాయి. కత్వలు కనిపించడం లేదు. క్యాచ్ మెంట్ ఏరియా లేదనే కారణాన్ని చూపిస్తూ నీటి పారుదల శాఖ అధికారులు మ్యాపులను ఇష్టానుసారంగా మార్చేస్తూ వచ్చారని రావిర్యాల గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏక్ సాల్ పట్టాల మాయాజాలమే. చెరువులో నీళ్లు లేని కాలంలో సాగు చేసుకోవడానికి రెవెన్యూ శాఖ ఇచ్చే తాత్కాలిక అనుమతినే ఏక్ సాల్ పట్టా అంటారు. చాలా కాలం క్రితం వరకు వందలాది మందికి ఏక్ సాల్ పట్టాలు ఉండేవి. మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ హయాంలో వీటిని పట్టాలుగా మార్చాలంటూ పోరాటమే చేశారు. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండానే.. ఎఫ్టీఎల్ పరిధిలోని ఈ భూములకు రికార్డుల్లో పట్టా భూములుగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడక్కడ హెచ్ఎండీఏ లే అవుట్లకు అనుమతులు కూడా జారీ చేసింది. ప్లాట్లు నీళ్లల్లో తేలియాడుతూ కనిపిస్తున్నాయి. వర్షం వచ్చిన తెల్లారి వెళ్తే ఈదుకుంటూ ప్లాట్ల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి కనిపిస్తున్నది.

మట్టితో పూడ్చేసి..

ఓ వైపు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హార్డ్‌ వేర్‌ పార్కు, మరో వైపు ప్రధాన రహదారికి అత్యంత సమీపంలోని ప్రాంతం. జాతీయ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ సంస్థలు.. ఈ క్రమంలో ఎకరా రూ.10 కోట్లకు పైగా పలికే భూములు ఇవి. రావిర్యాల చెరువు పరిధిలో కొంత ప్రభుత్వ భూమిగా రికార్డులు ఉన్నాయి. మిగతా కొన్ని వందల ఎకరాల వరకు పట్టా భూములుగా ఉన్నాయి. ఐతే అవన్నీ కొన్ని దశాబ్దాల క్రితం ‘ఏక్‌ సాల్‌ పట్టాలు’గా రికార్డుల్లో ఉండేవి. కానీ వాటిని టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో పట్టా భూములుగా రికార్డులు మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏక్‌సాల్‌ పట్టాల కింద ఉన్న భూములన్నీ ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకే వస్తాయి. పాత రికార్డులను పరిశీలిస్తే ఆ భూములన్నీ కచ్చితంగా ఏక్‌ సాల్‌ పట్టాలుగానే ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. వీటిని లేఅవుట్లుగా చేస్తే అధికారులు తమకు అనుమతులు ఇవ్వరన్న ఉద్దేశ్యంతో రైతులు తక్కువ ధరలకే బడా సంస్థలకు విక్రయించారు. రూ.కోట్లు పలికే భూములు అగ్గువ ధరకే వస్తుండడంతో పెద్దలు క్యూ కట్టారు. ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ దందాను మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎఫ్‌టీఎల్‌ పరిధి నుంచి విముక్తి పొందేందుకు పావులు కదిపారు. 18 అడుగుల ఎత్తు వరకు మట్టిని నింపితే ఎఫ్‌టీఎల్‌ ముప్పు నుంచి తప్పిస్తామన్న రెవెన్యూ, నీటి పారుదల, హెచ్‌ఎండీఏ అధికారుల సలహా, సహకారంతో కొనుగోలు చేసిన భూములను మట్టితో నింపేస్తున్నారు. దీని కోసం కాల్వలను, కత్వలను మూసేశారు. ఎటు నుంచీ నీళ్లు రాకుండా మాయం చేశారు.ఆఖరికి తమ స్థలం ఎఫ్టీఎల్ పరిధిలోనిది కాదని నిరూపిస్తున్నారు.

ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణలో నిర్లక్ష్యం

హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులను సర్వే చేసి వాటి హద్దురాళ్లు, ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించాలని చాలా కాలం క్రితమే నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును పేరుమోసిన ఓ సంస్థకు అప్పగించారు. కానీ రావిర్యాల పెద్ద చెరువును ఉద్దేశ్యపూర్వకంగానే సర్వేను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే పెండింగ్‌లో ఉన్నప్పటికీ వివాదాస్పద భూముల్లో లేఅవుట్లకు హెచ్‌ఎండీఏ అధికారులు అనుమతులు ఇవ్వడం విడ్డూరం. అక్కడి వెలుస్తున్న లేఅవుట్ల దగ్గర హెచ్‌ఎండీఏ లేఅవుట్‌గా బోర్డులు పెట్టారు. బ్రోచర్లల్లోనూ హెచ్‌ఎండీఏ ఆమోదించిన లేఅవుట్‌ అంటూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. పైగా నీటి పారుదల శాఖ నుంచి ఎన్‌ఓసీ కూడా తీసుకోకుండానే అనుమతులు ఇచ్చారని జనం ఆరోపిస్తున్నారు. కొందరు పెద్దలేమో కొన్న స్థలానికి చుట్టూ ప్రహరీ నిర్మించుకొని కాపలాదారులను నియమించుకున్నారు. ఇంకొందరు భూమిని చదును చేసి లేఅవుట్లను వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూమిగా సర్వే నం.332, 235, 443, 234, 446, 239, 238, 240, 236, 237, 243లోనిది చూపించారు. కానీ వాటి బై నంబర్లు మాత్రం పట్టాలుగా మార్చారు.

అంతా పెద్దలే..

ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఏక్‌సాల్‌ పట్టా భూములను కొనుగోలు చేసిన వారిలో బిల్డర్లు, ప్రముఖ హోటళ్ల యజమానులు, క్రికెటర్లు, సినీ స్టార్లు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ భార్య అంజలీ పేరిట ఆరు ఎకరాలు ఉండడం గమనార్హం. అలాగే క్రికెట్‌ అసోసియేషన్‌లో కీలక భూమిక పోషించే చాముండేశ్వరినాధ్‌ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. పొరుగు రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడి భూములను కొన్నవారిలో ఉన్నారు. అలాగే ఇంకా అనేక మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్‌ చేయించుకోలేదని రావిర్యాల, సర్దార్‌నగర్‌ గ్రామస్తులు చెబుతున్నారు. డైమాన్ మరియం కురియన్, ఆదిత్య హోమ్స్, ఆర్ గోపాల్ ఫైనాన్స్ లిమిటెడ్, సచిన్ టెండూల్కర్ భార్య అంజలి టెండూల్కర్, ఎంఎస్ శ్రీబసీబేస్ ప్రైవేటు లిమిటెడ్, వెంకిన చాముండేశ్వరినాథ్ లతో పాటు మరికొందరు సెలబ్రిటీలు, హీరోయిన్లు కూడా ఉన్నట్లు తెలిసింది.

Next Story