అందరూ వీడినా.. కాంగ్రెస్‌లో ఆ ఒక్కడున్నాడు

by  |
అందరూ వీడినా.. కాంగ్రెస్‌లో ఆ ఒక్కడున్నాడు
X

దిశ, జమ్మికుంట: ఓ వైపు రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక తరుణంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు సీనియర్లంతా గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరిపోయారు. ఉప ఎన్నికల వేళ ఆ పార్టీ బరువు, బాధ్యతలని తన భుజస్కంధాలపై వేసుకొని అన్నీ తానే.. ముందుకు సాగుతున్నాడు ఓ యువనేత. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన ఇంగ్లే రామారావు అనే యువనేత మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ, ఇటీవల కాలంలో పార్టీ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు. పలువురు సీనియర్లు పార్టీని వీడినప్పటికీ.. రామారావు మాత్రం మొదటినుండి నమ్మిన పార్టీలో ఉంటానంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు.

మొదటగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన రామారావు యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శిగా, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా, ఇల్లందకుంట దేవస్థానం డైరెక్టర్‌గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఇల్లందకుంట మండల పార్టీకి అధ్యక్ష పదవి ఖాళీగా ఉన్నప్పటికీ అధిష్టానం సూచనలు పాటిస్తూ, మండలంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నాడు. పార్టీ ఆదేశిస్తే మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని రామారావు దిశతో తెలిపారు. కాగా, ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని పూర్తిస్థాయిలో పనిచేసే నాయకుడికి ఇవ్వాలని, ఇతర పార్టీలకు అమ్ముడుపోయే నాయకులకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందని పలువురు చర్చించుకుంటున్నారు.



Next Story