20 నిమిషాల్లో ఎలక్ట్రిక్ బైక్‌గా మారనున్న సైకిల్

by  |
Bicycle-Into-an-Electric-Bi
X

దిశ, ఫీచర్స్ : రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మధ్యతరగతి జీవితాలకు ప్రయాణం పెనుభారమైంది. మరోవైపు నగరాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకుని ప్రజారోగ్యంపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌(EV)కు ప్రాధాన్యత పెరిగింది. స్టార్టప్స్‌తో పాటు వరల్డ్ క్లాస్ మేకర్స్ సైతం ఈ తరహా వాహనాల తయారీకి మొగ్గుచూపుతున్నారు. ఇదే క్రమంలో పలు కంపెనీలు e-సైకిల్స్‌ను రూపొందిస్తుండగా, పుణెకు చెందిన ఓ స్టార్టప్.. ఒరిజినల్ సైకిల్‌నే ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అది కూడా కేవలం 20 నిమిషాల్లోనే మార్చుకోవచ్చని చెబుతోంది. మరి ఆ ప్రత్యేకతలేంటో మీరూ తెలుసుకోండి..

పుణె బేస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ‘ఫెలిడే ఎలక్ట్రిక్’.. కస్టమర్లు తమ ఒరిజినల్ సైకిల్‌ రూపురేఖలు మార్చకుండా దాన్ని ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకునేందుకు సొల్యూషన్ కనిపెట్టింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ కన్వర్షన్‌ కిట్‌‌ను రూపొందించగా, దీని ధర కేవలం రూ.20వేలు మాత్రమే. అంతేకాదు 20 నిమిషాల్లోనే వినియోగదారులు దీన్ని తమ సైకిల్‌కు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా సైకిల్‌ను 25 కిమీ టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లే e-సైకిల్‌గా మార్చుకోవచ్చు. ఈ కన్వర్షన్ కిట్‌కు సంబంధించిన బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే.. 40-50 కిమీ వరకు ప్రయాణించవచ్చు. అయితే ఈ గణాంకాలు ‘సైకిలిస్ట్ బాడీ వెయిట్, రోడ్ కండిషన్స్, పెడల్ అసిస్ట్ లెవల్’ వంటి ఫ్యాక్టర్స్‌పై ఆధారపడి ఉంటాయి. ఇక 36V 7.8 Ah లిథియం అయాన్ డిటాచబుల్ బ్యాటరీలో ఏర్పాటుచేసిన ట్రాకర్.. FeFit అనే యాప్ ద్వారా యూజర్లు తమ సైకిల్‌ను ట్రాక్ చేయొచ్చు.

e-కన్వర్షన్ కిట్..

ఈ కిట్‌లో 250W Hub BLDC మోటార్‌, చార్జర్‌తో పాటు 36V 7.8 Ah సామ్‌సంగ్ లిథియం అయాన్ డిటాచబుల్ బ్యాటరీ, సిన్ వేవ్ BLDC మోటార్‌ కంట్రోలర్, అడ్వాన్స్‌డ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, థ్రోటిల్, ఎలక్ట్రికల్ బ్రేక్స్, పెడల్ అసిస్ట్ సెన్సార్ ఉంటాయి. ఇక ఇన్‌స్టాలేషన్ విషయానికొస్తే.. సైకిల్‌కు ఉన్న బ్యాక్ వీల్‌ను తొలగించి కన్వర్షన్ కిట్‌లో మోటార్‌తో వచ్చిన బ్యాక్ వీల్‌ను అమర్చితే సరిపోతుంది. కిట్‌తో పాటు ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించిన కస్టమర్ మాన్యువల్ కూడా అందజేస్తున్నారు. ఇంకా ఏవైనా సందేహాలుంటే కంపెనీ సపోర్ట్ టీమ్‌ను కాంటాక్ట్ చేసే అవకాశం కల్పించారు.

‘ఈ రోజుల్లో మంచి మొబైల్ కొనేందుకే రూ.25వేలు వెచ్చిస్తున్నాం. అలాంటిది కేవలం రూ.20వేలతో మామూలు మెకానికల్ సైకిల్‌ను గుడ్ క్వాలిటీ ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకోవడమంటే యూజర్లకు చాలా బెనిఫిట్. పాండమిక్ ద్వారా ప్రజల్లో హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువైంది. అలాంటి వారికి మా e-కిట్ తప్పకుండా వండర్‌ఫుల్ సొల్యూషన్ అవుతుంది. e-కిట్ ఫిట్టింగ్ ప్రాసెస్‌ సింపుల్‌‌గా అర్థమయ్యేలా వివరించే వీడియోను త్వరలోనే విడుదల చేస్తాం’ అని ‘ఫెలిడే ఎలక్ట్రిక్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రియోన్ మథ్యూ వెల్లడించారు.


Next Story