శాసన మండలిలో వైసీపీ హవా.. టీడీపీకి చుక్కలే

by  |
jagan in assembly
X

దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 151 స్థానాల్లో ఘన విజయం సాధించింది. దీంతో అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం చెప్పిందే వేదం అన్న మాదిరిగా మారిపోయింది. అసెంబ్లీలో వైసీపీ సంఖ్యాబలం ఎక్కువ కావడంతో ప్రతీ బిల్లు ఆమోదింపబడుతుంది. అయితే మండలిలో అందుకు పూర్తిగా విరుద్ధం. శాసన మండలిలో టీడీపీ సభ్యులు అత్యధికంగా ఉన్నారు. అందువల్లే వైసీపీ పంపిన రెండు బిల్లులు పెండిగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మండలిలోనూ పూర్తి మెజారిటీ సాధించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. శాసనమండలిలో రాబోయే జూలై నాటికి పార్టీల బలాల్లో తీవ్రమైన మార్పులు రాబోతున్నాయి.

ప్రస్తుతం మండలిలో మెజారిటీ ఉన్న టీడీపీకి జూలైలో మైనారిటీలో పడిపోగా వైసీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది. మండలిలో 58 స్థానాలకు గానూ వైసీపీకు 18, టీడీపీకు26, ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్‌కు ఐదుగురు, బీజేపీ మూడు, ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. మరో మూడు ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇటీవలే గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేశారు. ఈ నలుగురు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. ఆ స్థానంలో వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో మండలిలో ప్రస్తుతం వైసీపీ బలం 22, టీడీపీ బలం 22కు పడిపోయింది.

అలాగే ఈ నెలాఖరులోగా మరో 8 మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానాలను సైతం వైసీపీ కైవసం చేసుకోవాలని వ్యూహరచన చేస్తోంది. దీంతో జూలై నాటికి మండలిలో వైసీపీ బలం 33కి చేరుకోగా టీడీపీకి కేవలం 14కి పడిపోనుంది. దీంతో మెుత్తం మండలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగనుంది. టీడీపీ సభ్యులు అత్యధికంగా ఉండటంతో అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదంపొందిన కొన్ని కీలకమైన బిల్లులు మండలిలో ఆమోదం పొందకుండా టీడీపీ అడ్డుకుంటోంది.

సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను ప్రవేశపెట్టినపుడు మండలిలో టీడీపీ రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆనాడే సీఎం జగన్ శాసన మండలిని రద్దు చేయాలని ప్రతిపాదన తీసుకువచ్చారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో సభ్యుల సంఖ్యపెరుగుతుండటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తిరుగులేని శక్తిగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో శాసన మండలిలోనూ తిరుగులేని శక్తిగా అవతరించబోతుంది.


Next Story

Most Viewed