నేపాల్ ప్రధాని బాలెన్ షా యూటర్న్.. భారత్, చైనా రాయబారులతో విడిగా భేటీకి సిద్ధం

by Ramesh Naini |

విదేశీ రాయబారులతో వ్యక్తిగతంగా సమావేశాలు నిర్వహించబోనన్న తన స్వీయ విధానానికి నేపాల్ ప్రధాని బలేన్ షా వెనక్కి తగ్గారు.

నేపాల్ ప్రధాని బాలెన్ షా యూటర్న్.. భారత్, చైనా రాయబారులతో విడిగా భేటీకి సిద్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశీ రాయబారులతో వ్యక్తిగతంగా సమావేశాలు నిర్వహించబోనన్న తన స్వీయ విధానానికి నేపాల్ ప్రధాని బలేన్ షా వెనక్కి తగ్గారు. భారత్, చైనా రాయబారులతో ఈ వారం విడివిడిగా సమావేశం కానున్నట్లు నేపాల్ మీడియా వెల్లడించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బలేన్ షా విదేశీ రాయబారులతో ఒకరితో ఒకరు సమావేశాలు నిర్వహించకుండా, సమిష్టి సమావేశాలకే పరిమితమయ్యారు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, చైనా ప్రతినిధులు, అమెరికా ఉన్నతాధికారులతో కూడా వ్యక్తిగత భేటీలను ఆయన తిరస్కరించారు. ఈ వైఖరిపై మాజీ దౌత్యవేత్తలు, రాజకీయ విశ్లేషకులు, మీడియా నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు..

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తైన అనంతరం షా తన వైఖరిని మార్చుకున్నారు. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ, చైనా రాయబారి జాంగ్ మావోమింగ్‌లతో ఒకే రోజు విడివిడిగా సమావేశం కానున్నట్లు సమాచారం. ఇరు పొరుగు దేశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చాటిచెప్పడమే ఈ నిర్ణయం ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నేపాల్ విదేశాంగ ప్రయోజనాల దృష్ట్యా భారత్, చైనాతో సన్నిహిత దౌత్య సంబంధాలు కొనసాగించడం అవసరమని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో బలేన్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, యువత (Gen-Z) ఆందోళనల మద్దతుతో గత ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ ఏడాది మార్చిలో బాలెన్ షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విదేశీ ప్రతినిధులను ఏకాంతంగా కలవడానికి నిరాకరిస్తూ, గత ఏప్రిల్, మే నెలల్లో కేవలం ఉమ్మడి సమావేశాలు మాత్రమే నిర్వహించారు.

Next Story