బ్రేకింగ్ న్యూస్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త వార్ ?

164
kcr-and-modi

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న యాసంగి సీజన్‌కు వరి సాగు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ జరుగుతున్నది. ముఖ్యమంత్రి ఢిల్లీలో మకాం వేశారు. రాష్ట్ర మంత్రులూ అక్కడే ఉన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులకు పిలుపునిచ్చాయి. ఆరుతడి పంటలు, పప్పు ధాన్యాలు, నూనెగింజలు తదితర పంటలు వేసుకోవాలని సూచించాయి. కానీ ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేయాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రణాళిక ఖరారు చేయలేదు. సూచించిన ప్రత్యామ్నాయ పంటల్లో కొన్ని ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) జాబితాలో లేవు. వీటికి ప్రభుత్వం ఏ ధర నిర్ణయిస్తుందనేది రైతులకు అయోమయంగా ఉన్నది. ఎంఎస్పీ ఉన్న పంటలకే భరోసా లేనప్పుడు ఇతర పంటలపై నమ్మకం ఎలా ఉంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంతో యుద్ధమే అని ఢిల్లీ వెళ్లిన సీఎం అక్కడి నుంచి వచ్చిన తర్వాత వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల మంత్రులతో, అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాతనే ప్రత్యమ్నాయ పంటలపై క్లారిటీ రానున్నది. ఇంతకాలం వరి సాగుకు అలవాటు పడిన రైతులు నీటి సౌకర్యం ఉన్న భూముల్లో వరి పండించడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు ఎంఎస్పీ రేటు, ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌకర్యం, ప్రభుత్వం నుంచి భరోసా లేకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేమని రైతులు అభిప్రాయపడుతున్నారు. వరి పంట సాగవుతున్న నేలల్లో ప్రత్యామ్నాయ పంటలను పండించడం ఇబ్బందేనని, రెండేళ్ల తర్వాత మాత్రమే భూసారం అనుకూలంగా మారుతుందని, అప్పుడే ఆరుతడి పంటలు సాధ్యమంటున్నారు.

ఆముదాలు, కుసుమ పంటలపై అయోమయం

వరికి బదులుగా ఆముదాలు, తెల్ల కుసుమ లాంటి పంటలను పండించాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఇటీవల రైతులకు సూచించారు. కానీ ఈ రెండు పంటలకు ధర ఎంత ఉంటుందో తెలియకపోతే ఎలా నిర్ణయం తీసుకుంటామని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రానున్న యాసంగి సీజన్‌కు పది రకాల ప్రత్యామ్నాయ పంటలను సూచించింది. ఇవన్నీ ఎంఎస్పీ జాబితాలో ఉన్నవే. కానీ ఆముదాలు, కుసుమ లాంటివి ఆ జాబితాలో లేకపోయినా పండించాలని సూచిస్తున్నది. సాగుతో పోలిస్తే వీటిని పండించడం, పెట్టుబడి ఖర్చు, నిరంతరం నిర్వహణ లాంటి భిన్నంగా ఉంటాయని, పంట చేతికొచ్చిన తర్వాత వాటిని ఎక్కడ అమ్ముకోవాలో, ఎంతకు అమ్ముకోవాలో ఖరారు కాకపోతే పండించి ప్రయోజనం ఏంటనే సందేహాలనూ రైతులు వ్యక్తం చేస్తున్నారు. నియంత్రిత సాగుపై గతంలో ప్రభుత్వం లోతుగా సమీక్షలు నిర్వహించినా ఆ తర్వాత అటకెక్కింది. ప్రత్యామ్నాయ సాగుపై ప్రభుత్వం నుంచి ఆ దిశగా క్లారిటీ రాకపోవడంతో చివరకు యాసంగి సాగు గందరగోళంగా మారింది.

ప్రోత్సాహకాలు లేకుంటే కష్టమే

“కేరళలో వరి సాగు తక్కువ. ఎక్కువగా పండ్లు, కూరగాయలే పండిస్తారు. కానీ వరి అవసరాల కోసం ఆ పంటను సాగుచేసేవారికి క్వింటాల్‌కు వెయ్యి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తున్నది. ఎంఎస్పీ రూ. 1960 ఉన్నప్పటికీ అదనంగా వెయ్యి ఇస్తున్నది. ప్రతిరోజూ తెలంగాణకు 16 రకాల పండ్లు, కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి బోయిన్‌పల్లి మార్కెట్‌కు వస్తున్నాయి. ఇక్కడి రైతులకు వీటిని అర్థం చేయించి ప్రోత్సహించి పండిస్తే ఇటు ప్రజలకూ, అటు రైతులకూ లాభం ఉంటుంది. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రత్యామ్నాయ పంటలకు కోతులు, అడవి పందులు, పందికొక్కుల చిక్కులు ఉంటాయి. రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించాలి”.
-సాగర్, కన్వీనర్, రైతు పోరాట సమన్వయ కమిటీ

వేరే పంటలు వేస్తే నష్టపోతాం

“యాసంగి సీజన్‌లోనూ వరి పంటకు అవకాశం ఉండాలి. మా భూములు వరికి తప్ప మిగతా పంటలకు అనుకూలం కావు. వేరే పంటలు వేస్తే నష్టపోతాం. ఆ పంటలు వేస్తే దిగుబడి, ఖర్చుకు తగినట్టు గిట్టుబాటుధర కల్పించాలి. నాకు 5 ఎకరాల భూమి ఉన్నది. భూమి మొత్తం వరి పంటకే అనుకూలం. ప్రత్యామ్నాయ పంటలు తప్పనిసరిగా వేయాలంటే వేస్తాం. కానీ పండకపోయినా, పండిన తర్వాత మార్కెట్ రేటు రాకపోయినా నేనే నష్టపోతాను. ప్రభుత్వం పట్టించుకోకపోతే అప్పుల్లో పడతాం. ”.
– బత్తుల పరమేష్, చిల్పకుంట్ల రైతు

“ప్రస్తుతానికైతే వరి పంటకే అవకాశం ఉండాలి. ఆ పంటకు అలవాటుపడిన భూములు ఇంకో రెండేళ్ల దాకా వేరే పంటలకు పనికిరావు. భూమి లోపల చెమ్మ ఎక్కువగా ఉండి ఎదగకముందే మురిగిపోతాయి. ప్రభుత్వం ఏదైనా ప్రోత్సాహకాలు ఇస్తే వేరే పంటలు వేయడానికి ఆలోచిస్తాం. అప్పటిదాకా వరి పంట తప్ప ఇంకోటి వేయలేం.
– మందడి భూపాల్‌రెడ్డి, చిల్పకుంట్ల రైతు