ఓటమిని జీర్ణించుకోలేకే తనపై బిగాల ఆరోపణలు : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-04 12:13:18  IST  )

పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త.. అధికారం కోల్పోవడంతో అసహనంతో తనపై పసలేని ఆరోపణలు చేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు.

ఓటమిని జీర్ణించుకోలేకే తనపై బిగాల ఆరోపణలు : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త
X

దిశ, నిజామాబాద్ అర్బన్ : పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త.. అధికారం కోల్పోవడంతో అసహనంతో తనపై పసలేని ఆరోపణలు చేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధన్ పాల్ మాట్లాడుతూ.. అవినీతి, అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక బిగాల గణేష్ తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును బిగాల ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోందన్నారు. అధికారం కోల్పోయిన ఆయన తీవ్ర అసహనంతో అవగాహన లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోను 60 స్థానాల్లో ఒకే ఒక్క సీటును గెలిచి, దాన్ని కూడా కాపాడుకోలేని అసమర్థ నాయకుడు బిగాల అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక గతంలో ఉన్న పెండింగ్ పనుల విషయమై అధికారులు మంత్రులను కలుస్తూ వారి దృష్టికి తీసుకెళుతున్నానని, పనులు పూర్తయ్యే దిశగా తన ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ధన్ పాల్ అన్నారు.


ఇది జీర్ణించుకోలేని బిగాల తనపైనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కనీసం అర్బన్ లోని పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూం కూడా ఇప్పించలేని నాయకుడని విమర్శించారు. ఐటీ హబ్ లో ఒక్క ప్రముఖ కంపెనీని కూడా తీసుకురాలేదన్నారు. మరి నగర ప్రజలకు ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వని అప్పటి గృహ నిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డిని, ఐటీ మినిష్టర్ గా ఉన్న కేటీఆర్ లను రాజీనామా చేయాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ధన్ పాల్ బిగాలను ప్రశ్నించారు. నగరంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటుచేసిన చెట్లలో కూడా అవినీతికి పాల్పడ్డ చరిత్ర బిగాలది అన్నారు. ఒక్కో చెట్టు ధర రూ. 4500 లుంటే దాన్ని రూ. 45 వేలుగా చూపించి భారీగా దోచుకున్న చరిత్ర నీది కాదా అని ప్రశ్నించారు. కార్పొరేషన్ లో 330 మంది పనిచేస్తున్నట్లు రికార్డుల్లో చూయించి నెలకు రూ. 50 లక్షలు దోచుకున్నారని ధన్‌‌ పాల్ ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఒక్కరూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపించే దమ్ముంటే బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని ధన్ పాల్ బిగాల గణేష్ గుప్తకు ధన్ పాల్ సవాల్ విసిరారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి, కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, మఠం పవన్ తదితరులున్నారు.

Next Story