హిందీ ఇష్టముంటేనే చదవొచ్చు..మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం

by Shamantha N |

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో హిందీ భాషను మూడో భాషగా తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని తీవ్ర విమర్శల నేపథ్యంలో సవరించింది.

హిందీ ఇష్టముంటేనే చదవొచ్చు..మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో హిందీ భాషను మూడో భాషగా తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని తీవ్ర విమర్శల నేపథ్యంలో సవరించింది. జూన్ 17న రాష్ట్ర పాఠశాల విద్యా విభాగం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మ‌రాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు హిందీకి బదులుగా ఇతర భారతీయ భాషను ఎంచుకునే అవకాశాన్ని పొందవచ్చు. ఒక తరగతిలో కనీసం 20 మంది విద్యార్థులు హిందీకి బదులుగా ఇతర భాషపై ఆసక్తి చూపితే ఆ భాషకు ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమిస్తారు. 20 మందికి తగ్గితే ఆ భాష బోధన ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహణ చేపడతారు.

తీవ్ర నిరసనల నేపథ్యంలో మార్పు

మహారాష్ట్ర స్టేట్ కరికులం – 2024 సిఫార్సుల మేరకు, మిగతా మాధ్యమాలున్న పాఠశాలల్లో తప్పనిసరిగా మరాఠీ, ఇంగ్లీష్ భాషలను నేర్పించాలని పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ భాషా విధానం యథాతథంగా కొనసాగనుంది. ఏప్రిల్‌లో హిందీని తప్పనిసరి చేయాలని మహా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన సహా పలు రాజకీయ పార్టీలు దీన్ని తీవ్రంగా విమర్శించాయి. భాషా సలహా సంఘం సిఫార్సుతో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ జోక్యం చేసుకోవడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. విద్యార్థులకు భాషా ఎంపికలో స్వేచ్ఛ కల్పించే దిశగా కొత్త విధానాన్ని మహారాష్ట్ర విద్యాశాఖ రూపొందించింది.

Next Story