- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన దేశం ఇదే.. : IQAir వెల్లడి
ప్రపంచంలో అత్యంక కాలుష్యపూరితమైన దేశంగా పాకిస్థాన్ తొలిస్థానంలో నిలిచింది. భారత్ లో ఉన్న ఓ నగరం అత్యంత కలుషితమైన నగరాల్లో నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్: 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పూరిత దేశంగా పాకిస్థాన్ నిలిచింది. గాలిలో ఉండే ప్రమాదకర సూక్ష్మ కణాలు (PM2.5) ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన పరిమితుల కంటే 13 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. పాకిస్థాన్ తర్వాత బంగ్లాదేశ్, తజకిస్థాన్ దేశాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి దక్షిణ ఆసియాలో గాలి నాణ్యత ఎంత దారుణంగా ఉందో చాటిచెప్పాయి. స్విట్జర్లాండ్ కు చెందిన వాయునాణ్యత పర్యవేక్షణ సంస్థ.. ఐక్యూఎయిర్ తన వార్షిక నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
భారత్‌కు కాలుష్య సెగ
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పూరిత నగరంగా ఉత్తరప్రదేశ్‌లోని 'లోని' (Loni) నిలిచింది. ఇక్కడ సగటు PM2.5 స్థాయి 112.5 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది. ఇది WHO పరిమితి కంటే 22 రెట్లు ఎక్కువ. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని టాప్-25 అత్యంత కాలుష్య నగరాలన్నీ భారత్, పాకిస్థాన్, చైనా దేశాల్లోనే ఉన్నాయి. మన దేశంలో ఢిల్లీ, ఘజియాబాద్ వంటి నగరాలు కూడా టాప్-10 జాబితాలో నిలిచాయి.
డేటా గ్యాప్ వల్లే 'చాద్' ర్యాంకులో మార్పు?
గతేడాది (2024) అత్యంత కాలుష్య దేశంగా ఉన్న 'చాద్', ఈసారి నాలుగో స్థానానికి పడిపోయింది. అయితే.. ఇది కాలుష్యం తగ్గడం వల్ల వచ్చిన మార్పు కాదని, అమెరికా తన గ్లోబల్ మానిటరింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపివేయడం వల్ల తలెత్తిన డేటా కొరత వల్లే ఇలా కనిపిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. బడ్జెట్ కారణాలతో డేటా సేకరణ ఆగిపోవడం వల్ల అనేక దేశాల్లోని వాస్తవ పరిస్థితులు తెలియడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
తెలుగు రాష్ట్రాల పరిస్థితి: అప్రమత్తంగా ఉండాల్సిందే!
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, విజయవాడలో ప్రస్తుతం గాలి నాణ్యత సాధారణంగానే ఉన్నప్పటికీ, శీతాకాలం మరియు పండుగ సమయాల్లో PM2.5 స్థాయిలు WHO ప్రమాణాల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో కూడా పారిశ్రామిక ప్రాంతాలు, వాహన కాలుష్యం వల్ల గాలి నాణ్యత తరచూ 'పేలవమైన' (Poor) స్థాయికి పడిపోతోంది. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మారిన వాతావరణం.. పెరిగిన ప్రమాదం
ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 శాతం నగరాలు మాత్రమే WHO గాలి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నాయి. కెనడాలో సంభవించిన భారీ కార్చిచ్చులు అమెరికా, ఐరోపా వరకు కాలుష్యాన్ని వ్యాప్తి చేశాయి. మరోవైపు 'లా నినా' ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల లావోస్, కాంబోడియా, ఇండోనేషియా వంటి దేశాల్లో కాలుష్యం కొంత మేర తగ్గడం విశేషం. ఆస్ట్రేలియా, ఐస్‌లాండ్, ఎస్టోనియా వంటి దేశాలు మాత్రమే స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్న దేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మొత్తంమీద 75 దేశాల్లో కాలుష్యస్థాయి స్వల్పంగా తగ్గగా.. 54 దేశాల్లో కాలుష్యం పెరిగినట్లు ఐక్యూఎయిర్ పేర్కొంది.






