Mpox : ‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్య’గా మంకీపాక్స్ : డబ్ల్యూహెచ్ఓ

by Hajipasha |
Mpox : ‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్య’గా మంకీపాక్స్ : డబ్ల్యూహెచ్ఓ
X

దిశ, నేషనల్ బ్యూరో : వైరల్ వ్యాధి ‘మంకీ పాక్స్’ (ఎంపాక్స్)‌ను ‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్య’గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం ప్రకటించింది. గత రెండేళ్లలో ఈ వ్యాధికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ ఈవిధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. తొలుత డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో బయటపడిన ఈ వ్యాధి, తర్వాత శరవేగంగా ఇరుగుపొరుగు ఆఫ్రికా దేశాలలో వ్యాపించింది. దీని వల్ల ప్రధానంగా గర్భిణులు, పిల్లలకు రిస్క్ ఎక్కువ. ఈ ఏడాది ఇప్పటివరకు 13 దేశాలకు చెందిన పిల్లలు, యువతలో మంకీ పాక్స్ కేసులను పెద్దసంఖ్యలో గుర్తించారు. ఆయా దేశాల్లో దాదాపు 500 మందికిపైగా ఈ వ్యాధి వల్ల చనిపోయారని సమాచారం.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో మంకీ పాక్స్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో డబ్ల్యూహెచ్ఓ అలర్ట్ అయింది. ఈ వైరల్ వ్యాధికి వ్యాక్సిన్ లభ్యత కూడా ప్రస్తుతం అంతగా లేకపోవడంతో ఆందోళనలు మిన్నంటాయి. ఈనేపథ్యంలోనే ఇతర ప్రపంచ దేశాలలో మంకీ పాక్స్ వ్యాపించకుండా ఉండేందుకుగానూ ‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్య’గా దాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈమేరకు వివరాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed