భార్య కేకలు.. కాటేసిన పాము.. ఒట్టిచేతులతో పట్టుకున్న యూఎస్ ఆరోగ్య మంత్రి.. వీడియో వైరల్

by Ramesh Naini |

అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ జూనియర్ (RFK Jr.) ఒట్టిచేతులతో రెండు పాములను పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భార్య కేకలు.. కాటేసిన పాము.. ఒట్టిచేతులతో పట్టుకున్న యూఎస్ ఆరోగ్య మంత్రి.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ జూనియర్ (RFK Jr.) ఒట్టిచేతులతో రెండు పాములను పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెడికేర్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మెహమెత్ ఓజ్ నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా కెన్నడీ నేరుగా తన ఒట్టిచేతులతో రెండు ‘బ్లాక్ రేసర్’ జాతి పాములను పట్టుకున్నారు. ఆ సమయంలో ఒక పాము ఆయన వేలిపై కాటేసింది. అయితే, ఆ జాతి పాములు విషపూరితమైనవి కాకపోవడంతో కెన్నడీకి ప్రమాదం తప్పింది.

భార్య కేకలు.. గర్వంగా ప్రదర్శించిన మంత్రి

కెన్నడీ పాములను పట్టుకున్న సమయంలో ఆయన భార్య చెరిల్ హైన్స్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ‘బాబీ.. దయచేసి వాటిని వదిలేయ్’ అంటూ ఆమె గట్టిగా కేకలు వేయడం వీడియోలో వినిపించింది. అయితే, ఆ పాములు తనను కరుస్తున్నప్పటికీ కెన్నడీ మాత్రం ఏమాత్రం భయపడకుండా నవ్వుతూ.. అక్కడ ఉన్న డాక్టర్ మెహమెత్ ఓజ్ దంపతులకు వాటిని గర్వంగా చూపించారు.

సోషల్ మీడియాలో విమర్శలు

దేశ ప్రజారోగ్య రంగాన్ని పర్యవేక్షించాల్సిన ఒక ఉన్నత స్థాయి క్యాబినెట్ మంత్రి ఇలాంటి పనులకు పాల్పడటంపై నెటిజన్లు, రాజకీయ విమర్శకులు మండిపడుతున్నారు. ఆరోగ్య మంత్రి ప్రాధాన్యతలు ఇవేనా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. కాగా, 2025 ఫిబ్రవరిలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాబర్ట్ ఎఫ్‌ కెన్నడీ వైఖరి నిరంతరం వివాదాస్పదంగానే సాగుతోంది. ‘మేక్ అమెరికా హెల్తీ అగైన్’ (MAHA) ఎజెండాతో ముందుకు వెళ్తున్న కెన్నడీ.. వ్యాక్సిన్లు, పబ్లిక్ హెల్త్ కమ్యూనికేషన్స్ విషయంలో వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ పాముల ఘటనతో ఆయన తీరుపై మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Next Story