- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా అవమానిస్తే ఎందుకు ఉండాలి? భారతీయులకు శ్రీధర్ వెంబు ఎమోషనల్ మెసేజ్
అమెరికా గ్రీన్‌కార్డు ప్రక్రియలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో గ్రీన్‌కార్డు (శాశ్వత నివాస హక్కు) ప్రక్రియలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇకపై గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే తాత్కాలిక వలసదారులు (H-1B వీసాదారులు వంటి వారు) అమెరికాలో ఉంటూ కాకుండా, స్వదేశానికి తిరిగి వెళ్లి అక్కడి నుంచే దరఖాస్తు సమర్పించాలని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనపై జోహో (Zoho) వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తీవ్రంగా స్పందించారు. అమెరికాలో వీసాలపై ఉన్న భారతీయులంతా ఆత్మగౌరవంతో స్వదేశానికి తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆత్మగౌరవంతో తిరిగొచ్చేయండి: శ్రీధర్ వెంబు
ఈ నిర్ణయంపై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన శ్రీధర్ వెంబు.. అమెరికాలోని భారతీయ టెక్కీలకు భావోద్వేగ పిలుపునిచ్చారు. ‘అమెరికాలో వీసాలపై ఉన్న భారతీయ సోదరులారా.. దయచేసి స్వదేశానికి వచ్చేయండి. ఈ కొత్త నిబంధన మనల్ని అవమానించేలా ఉంది. దీనిని మనం సహించాల్సిన అవసరం లేదు. ఎంతటి కష్టమైనా, త్యాగమైనా ఆత్మగౌరవమే ముఖ్యం. మన దేశ గర్వాన్ని చాటుదాం. భారతదేశ అభివృద్ధికి, ఇక్కడి యువతకు మీ సాంకేతిక నైపుణ్యం, నాయకత్వం ఎంతో అవసరం’ అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా నిర్ణయంపై టెక్ దిగ్గజాల ఆగ్రహం
ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని కేవలం భారతీయులే కాకుండా అమెరికా టెక్ దిగ్గజాలు సైతం తీవ్రంగా తప్పుబడుతున్నాయి. లింక్డ్‌ఇన్ సహ-వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్ స్పందిస్తూ.. ఈ నిబంధన వల్ల ఏఐ పరిశోధకులు, విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని, ఇది అమెరికా వ్యాపార, సాంకేతిక రంగాలకు పెద్ద దెబ్బని హెచ్చరించారు. ఏఐ నిపుణుడు ఆండ్రూ ఎంగ్ స్పందిస్తూ.. చట్టబద్ధమైన వలసలపై జరిగిన దాడిగా దీనిని అభివర్ణించారు. దీనివల్ల వైద్యులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తల కొరత ఏర్పడి అమెరికా పోటీతత్వం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్కీ యుచెన్ జిన్ స్పందిస్తూ.. ఈ నిబంధన అమల్లోకి వస్తే ఓపెన్ ఏఐ (OpenAI) వంటి అగ్రగామి సంస్థల్లో పనిచేసే సగానికి పైగా పరిశోధకులు అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. కాగా, వీసా కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అక్రమంగా దేశంలో ఉండిపోయే ధోరణిని అరికట్టడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఇమిగ్రేషన్ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికే ఈ మార్పులు చేసినట్లు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సమర్థించుకుంది. ప్రస్తుతం అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఉంటూ గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






