భారత పర్యాటకులను ఆకర్షించేందుకు మాల్దీవులు ఏం చేస్తుందంటే?

by Yella Dhawani Reddy |

పర్యాటక ప్రాంతాల్లో చాలా మందికి మాల్దీవులు డ్రీమ్ డెస్టినేషన్‌గా (Dream Destination) ఉంటుంది.

భారత పర్యాటకులను ఆకర్షించేందుకు మాల్దీవులు ఏం చేస్తుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: పర్యాటక ప్రాంతాల్లో చాలా మందికి మాల్దీవులు డ్రీమ్ డెస్టినేషన్‌గా (Dream Destination) ఉంటుంది. ముఖ్యంగా అక్కడి సహజమైన ప్రకృతి అందాలను చూసేందుకు భారత్ నుంచి పర్యాటకులు (Indian Tourists) భారీగా వెళ్లేవారు. అయితే, గతేడాది భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపడంతో భారత పర్యాటకులు మాల్దీవుల (Maldives)కు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాల్దీవులకు బదులుగా లక్ష్యదీప్‌కు క్యూ కట్టారు. దీంతో మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్‌లో మన దేశ స్థానం గణనీయంగా పడిపోయింది. 2023లో అగ్రస్థానంలో ఉన్న భారత్.. 2024 నాటికి 6వ స్థానానికి చేరింది. ఇక పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆ దేశం అప్రమత్తమైంది. భారతీయులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మాల్దీవుల ప్రభుత్వం 2025లో మూడు లక్షల మంది భారత పర్యటకులను రప్పించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మన దేశంలో నెలవారీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు 'మాల్దీవులు మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్' (MMPRC) ఛైర్మన్ అబ్దుల్లా గియాస్ తెలిపారు. మొదటిసారి భారత మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు ఓ బ్రాండ్ అంబాసిడర్‌నూ నియమించాలని భావిస్తున్నట్లు చెప్పారు. మాల్దీవుల్లో క్రికెట్ సమ్మర్‌ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే, ఇరు దేశాల విమానయాన సంస్థలతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా చెన్నై, పుణె, కోల్‌కతా వంటి నగరాల నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

2023లో మొత్తం 209,198 భారతీయులు మాల్దీవులను సందర్శించారు. అయితే 2024 ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) లక్ష్యద్వీప్‌ను సందర్శించి.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీంతో అనేక మంది భారతీయులు.. ఆ దేశ టూర్‌ ప్లాన్‌ను విరమించుకున్నారు. ఫలితంగా 2024లో భారత పర్యాటకుల సంఖ్య 1.30 లక్షలకు పడిపోయింది. అదే ఏడాది అక్టోబరులో ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు భారత్‌లో పర్యటించడంతో పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. ఈక్రమంలో భారత పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ దేశం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Next Story