జిల్లాలో రోజుకో చోట గంజాయి కలకలం..

by Taduka Kalyani |

వికారాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీసులు, సంబంధిత శాఖలు చర్యలు చేపడుతున్నప్పటికీ, అక్రమ రవాణా పూర్తిగా అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో రోజుకో చోట గంజాయి కలకలం..
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీసులు, సంబంధిత శాఖలు చర్యలు చేపడుతున్నప్పటికీ, అక్రమ రవాణా పూర్తిగా అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని జిల్లాకు తరలించి, పట్టణంలోని కొన్ని నిర్మానుష్య ప్రాంతాలు, హోటళ్ల పరిసరాలు, బస్‌స్టాండ్‌, రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మాదకద్రవ్యాలకు యువత అలవాటు పడుతూ నేరాల బాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల యాలాల్ మండలం గోవిందరావుపేట గ్రామంలో ఓ ఆశ్రమంలో 36 గంజాయి మొక్కలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అలాగే వికారాబాద్ పట్టణంలో ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కేసులు వరుసగా వెలుగులోకి వస్తున్నప్పటికీ, అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అడ్డుకోవడంలో లోపాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైలు, రోడ్డు మార్గాల ద్వారా జిల్లాకు సులభంగా చేరుకునే అవకాశాన్ని స్మగ్లర్లు వినియోగించుకుంటున్నారని పేర్కొంటున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా పోలీసులు, ఎక్సైజ్‌, ఇతర శాఖలు సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, గంజాయి విక్రయ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story