- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేలిన అగ్ని పర్వతం.. ముగ్గురు మృతి : 10 మంది పర్వాతారోహకులు గల్లంతు
తూర్పు ఇండోనేషియాలోని హల్మహెరా ద్వీపంలో ఉన్న 'మౌంట్ డుకోనో' అగ్నిపర్వతం శుక్రవారం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది.

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు ఇండోనేషియాలోని హల్మహెరా ద్వీపంలో ఉన్న 'మౌంట్ డుకోనో' (Mount Dukono) అగ్నిపర్వతం శుక్రవారం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విదేశీయులతో సహా ముగ్గురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గల్లంతయ్యారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద సుమారు 10 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆకాశంలోకి ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఈ విస్ఫోటనం పర్వతారోహకులను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసింది.
ప్రమాదకరంగా మారిన సహాయక చర్యలు
విస్ఫోటనం సమయంలో పర్వతంపై ఉన్న ఏడుగురు సురక్షితంగా కిందకు చేరుకోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ (BNPB), బసర్నాస్ (Basarnas) బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే, అగ్నిపర్వతం నుంచి నిరంతరం వస్తున్న శబ్దాలు, విపరీతమైన పొగ, రాళ్లతో కూడిన బూడిద కారణంగా రెస్క్యూ ఆపరేషన్లకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వాహనాలు వెళ్లే అవకాశం లేని దుర్భరమైన మార్గాల్లో.. బాధితులను స్ట్రెచర్లపై మోసుకురావాల్సి వస్తోందని పోలీసులు తెలిపారు.
హెచ్చరికలు ఉన్నా బేఖాతరు
మౌంట్ డుకోనో ప్రస్తుతం 'లెవల్-2' అలర్ట్‌లో ఉంది. అగ్నిపర్వత కార్యకలాపాలు పెరగడంతో గత నెలలోనే అధికారులు ఆ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా నిషేధిత ప్రాంతంగా (Restricted Zone) ప్రకటించారు. అయితే.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు పర్యాటకులు నిబంధనలను అతిక్రమించి మరీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అగ్నిపర్వతానికి ఉత్తర దిశలో ఉన్న టోబెలో నగరంలో భారీగా బూడిద కురిసే అవకాశం ఉందని, ఇది గాలి నాణ్యతను దెబ్బతీసి రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చని జియోలాజికల్ ఏజెన్సీ హెచ్చరించింది.
ఇండోనేషియా పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 130 క్రియాశీల అగ్నిపర్వతాలలో మౌంట్ డుకోనో ఒకటి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని, సహాయక బృందాలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






