భారత్‌‌కు ఊరట.. భారీగా టారిఫ్‌లు తగ్గించిన రష్యా

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-15 07:52:05  IST  )

రష్యాపై మరింత ఒత్తిడి పెంచేలా అమెరికా సెనేటర్లు సవరించిన సరికొత్త ఆంక్షల బిల్లును ప్రవేశపెట్టారు.

భారత్‌‌కు ఊరట.. భారీగా టారిఫ్‌లు తగ్గించిన రష్యా
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యాపై మరింత ఒత్తిడి పెంచేలా అమెరికా సెనేటర్లు సవరించిన సరికొత్త ఆంక్షల బిల్లును ప్రవేశపెట్టారు. అయితే.. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్‌ను భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాతో పాటు ఇతర దేశాలకు విధించాలనుకున్న భారీ టారిఫ్‌లను (సుంకాలను) ఈ కొత్త బిల్లులో గణనీయంగా తగ్గించడం గమనార్హం. దివంగత అమెరికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం రూపకల్పన చేసిన ఈ ద్వైపాక్షిక బిల్లు.. రష్యా ఆదాయ వనరులపై దెబ్బకొట్టడంతో పాటు రష్యా ఇంధనంపై ఆధారపడే దేశాలు ఆ దిగుమతులను తగ్గించుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకువచ్చారు.

టారిఫ్‌లు 500% నుండి 100% కి తగ్గింపు

ఈ సవరించిన ప్రతిపాదన ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై విధించే గరిష్ట సుంకాన్ని 100 శాతానికి తగ్గించారు. మునుపటి బిల్లులో దీనిని ఏకంగా 500 శాతంగా ప్రతిపాదించగా, ఇప్పుడు దానిని భారీగా తగ్గించడం భారత్ వంటి దేశాలకు పెద్ద ఉపశమనం కానుంది. రష్యా గ్యాస్ ఎగుమతుల్లో 15 శాతం కంటే తక్కువ దిగుమతి చేసుకుంటూ.. ఆ దిగుమతులను తగ్గించుకోవడానికి గణనీయమైన చర్యలు తీసుకుంటున్న దేశాలకు ఈ బిల్లులో ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల జపాన్, ఫ్రాన్స్, హంగేరి, బెల్జియం వంటి దేశాలకు ప్రయోజనం చేకూరనుంది. సెనేట్ వర్గాల సమాచారం ప్రకారం.. రష్యా క్రూడాయిల్‌ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, స్లోవేకియా, హంగేరి, అజర్‌బైజాన్ ఉన్నాయి. అలాగే రష్యా గ్యాస్‌ను ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగేరి, బెల్జియం ముందువరుసలో ఉన్నాయి.

రష్యా 'షాడో ఫ్లీట్'.. బ్యాంకులపై గురి!

టారిఫ్‌ల తగ్గింపుతో ఇతర దేశాలకు ఊరటనిచ్చినప్పటికీ, రష్యాపై కఠిన చర్యలను మాత్రం ఈ బిల్లులో కొనసాగించారు. పాశ్చాత్య దేశాల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రష్యా రహస్య ఆయిల్ ట్యాంకర్ల వ్యవస్థ (Shadow Fleet) పై ఆంక్షలు విధించనున్నారు. రష్యా సెంట్రల్ బ్యాంక్‌తో సహా అక్కడి కీలక ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. రష్యాకు చెందిన ప్రతిష్టాత్మక ఇంధన ప్రాజెక్టులైన యామల్ ఎల్‌ఎన్‌జీ (Yamal LNG), ఆర్క్టిక్ ఎల్‌ఎన్‌జీ (Arctic LNG 1, 2, 3)లపై గట్టి నిఘా ఉంచనున్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమని భావిస్తే.. రష్యాపై విధిస్తున్న ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేసే లేదా మినహాయింపులు ఇచ్చే విచక్షణాధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ బిల్లు కల్పించింది. సౌత్ కరోలినా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమొక్రాటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ సంయుక్తంగా 2025 ఏప్రిల్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే.. ఇటీవల ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నప్పుడు అధ్యక్షుడు ట్రంప్‌తో ఈ బిల్లుపై ఒప్పందం కుదిరిందని ప్రకటించిన మరుసటి రోజే లిండ్సే గ్రాహం ఆకస్మికంగా మరణించారు. ప్రస్తుతం ఈ బిల్లుకు ఇరు పార్టీల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది.

Next Story