అప్పు తిరిగి చెల్లించలేదని నిర్మాణదారులు చేసిన పనికి స్పందించిన కార్మిక శాఖ

by Kodari Anjali |

వైద్యం కోసం చేసిన అప్పే శాపంగా మారింది.

అప్పు తిరిగి చెల్లించలేదని నిర్మాణదారులు చేసిన పనికి స్పందించిన  కార్మిక శాఖ
X

దిశ, శేరిలింగంపల్లి: వైద్యం కోసం చేసిన అప్పే శాపంగా మారింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని నిర్మాణదారులు బరితెగించారు. భార్యాభర్తలను బానిసలుగా బంధించి నాలుగేళ్లగా పని చేయించుకుంటున్న దారుణం మియాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎ. శ్రీను ఇచ్చిన పంచనామా నివేదిక ఆధారంగా కోట శ్రీనివాస్ (40) తన భార్య వైద్య చికిత్స కోసం కాంట్రాక్టర్ రాములు వద్ద రూ.2 లక్షలు, మరో కాంట్రాక్టర్ కృష్ణ వద్ద రూ.1 లక్ష అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించలేకపోవడంతో.. కాంట్రాక్టర్లు రాములు, కృష్ణ.. శ్రీనివాస్‌తో పాటు అతని భార్య రమ్యను మియాపూర్ న్యూ హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌లోని నిర్మాణంలో ఉన్న భవనానికి తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడే వారిని గత నాలుగు సంవత్సరాలుగా వెట్టి చాకిరీ (బాండెడ్ లేబర్) చేయిస్తూ బలవంతంగా పని చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పు తీర్చలేదని భార్యాభర్తలను నిర్బంధించిన ఘటనపై కార్మిక శాఖ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్ల నరకం నుంచి బాధితులకు విముక్తి లభించడంతో సంతోషం వ్యక్తం చేశారు.

Next Story