జిల్లాను శాసిస్తున్న ఆంధ్ర బాయ్..!

by Kodari Anjali |

ప్రమాదకరమైన గ్లైపొసేట్‌ రసాయనిక మందులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్నాయి.

జిల్లాను శాసిస్తున్న ఆంధ్ర బాయ్..!
X

దిశ, కాటారం: ప్రమాదకరమైన గ్లైపొసేట్‌ రసాయనిక మందులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్నాయి. కలుపు నివారణ పేరిట ఇప్పటికే గ్లైసిల్‌(బీటీ-3) విత్తనాలను రైతులకు అంటగట్టిన ఆంధ్ర బాయ్( స్మగ్లర్లు) ఎంతో హానికరమైన గ్లైపోసెట్‌ రసాయనాలను అదే రీతిన పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా తెచ్చి రహస్య ప్రాంతాల్లో నిలువ చేసి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే జిల్లాలో కనీసం 50 వేల లీటర్లకు పైగా గ్లైపోసెట్‌ రసాయనిక ఎరువుల మందులు దిగుమతి అయినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా భూపాలపల్లి, మహాదేవపూర్, పలిమెల, కాటారం, మహా ముత్తారం, వివిధ మండల కేంద్రాలతో ఈ మందు క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. వ్యవసాయాధికారులు కూడా ఇదే విషయాన్ని రూడీ చేయడం ఎంతైనా ప్రస్తావనార్హం. గ్లైపోసెట్‌ రసాయనాలను కేవలం జన్యుపరమైన మార్పులు చేసిన విత్తనాలు నాటిన పంటలు మాత్రమే తట్టుకునే పరిస్థితి ఉంది. అయితే కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఈ మందులను రైతులు కలుపును నివారించి ఖర్చు తగ్గిస్తుందన్న గుడ్డి నమ్మకంతో కొనుగోళ్లకు ఎగబడుతుండడంతో దళాారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

గతంలో పట్టుబడిన మారని తీరు..

రాష్ట్రంలో గ్లైపోసెట్‌ విక్రయాలపై ఆంక్షలు కఠినతరం చేయడంతో అధికారికంగా ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఈమందు విక్రయాలు నిలిచి పోయాయి. అయితే దీనిని ఆసరాగా చేసుకొని ఆంధ్ర బాయ్ స్మగ్లర్ రహస్యం గోదాంలను ఏర్పాటు చేసుకుని ఖరీఫ్‌కు ముందే భారీగా గ్లైపోసెట్‌ మందులను నిల్వ చేసినట్లు సమాచారం. గతంలో సరిహద్దు ప్రాంతమైన ఆంధ్ర, గుజరాత్, మహారాష్ట్ర, నుంచి గ్లైపోసెట్‌ మందుల రవాణా జరిగేది. దాంతో వ్యవసాయ శాఖ విజిలెన్స్‌ విభాగం అందించిన సమాచారంతో పోలీసులు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవడమే కాకుండా భారీ ఎత్తున నిల్వలను సీజ్‌ చేశారు. అయినా అక్రమ వ్యాపారానికి అలవాటు పడ్డ ఆంధ్ర బాయ్ రూటు మార్చి ప్రస్తుతం మహారాష్ట్ర మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు గ్లైపోసెట్‌ను దొడ్డిదారిన దిగుమతి చేసుకుని రహస్యంగా విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 20 రోజుల క్రితం కాటారం సబ్ డివిజన్ కి చెందిన ముగ్గురు దళారులతో కలిసి రెండు లారీల పరిమాణంలో గ్లైపోసెట్‌ను సరిహద్దు ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో నుంచి ఇప్పటికే భూపాలపల్లి, కాటారం, మహా ముత్తారం, మహాదేవపూర్, పంకెన, వివిధ మండలాలకు వీటిని పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.

అర లీటరు నుంచి 20 లీటర్ల పరిమాణంలో..

జిల్లాలో గ్లైసిల్‌ సాగు వద్దని అధికారులు చెప్పినా పలువురు రైతులు వారి సూచనలను పాటించలేదు. 20 రోజుల వ్యవధిలోని 50 వేల లీటర్లకు పైగా గ్లైపోసెట్‌ మందులు జిల్లాలోని నలుమూలలకు దిగుమతి అయినట్లు సమాచారం. ఈనేపథ్యంలో అసలు ఈ గ్లైపోసెట్‌ క్రయ విక్రయాలు ఎలా జరుగుతున్నాయన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. జన్యుపరంగా మార్పులు చేసిన పత్తి విత్తనాలను సాగు చేసిన పత్తి పంటలో ఈ మందులను చల్లినప్పుడు పత్తి మొక్కలు మినహా మిగతా గడ్డి పంటలు రసాయనిక ప్రభావంతో చనిపోతాయి. అలా ఒక పంట కాలం మొత్తం రెండు, నుంచి మూడు దఫాలుగా ఈ మందులు చల్లితే ఆ పత్తి పంటలో ఇక గడ్డి మొలవదు. ఒకసారి మందు చల్లితే రసాయనిక గాఢత వల్ల దాని ప్రభావం 21 రోజుల పాటు నేలపై ఉంటుంది. ఫలితంగా మొలిచిన గడ్డి చనిపోవడంతో కొత్తగా గడ్డి మొలిచే పరిస్థితిని నివారిస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగానే రైతులు గ్లైపోసెట్‌ కోసం ఎగబడుతున్నారు. దీన్ని సొమ్ము చేసుకు నేందుకు ఆంధ్ర బాయ్ స్మగ్లర్లు అర లీటరు మొదలుకొని 20 లీటర్ల పరిమాణంలో క్యాన్లలో గ్లైపోసెట్‌ను విక్రయిస్తున్నారు. ఎకరానికి 1.5 లీటరు నుంచి 2 లీటర్ల వరకు చల్లుతున్నారు. ఈ లెక్కన ఒక్కో రైతు రెండు హెక్టార్లకు గాను 7.5 లీటర్ల నుంచి పది లీటర్ల వరకు ఒక దఫాలో చల్లుతున్నారు. ఇలా పంట కాలం ముగిసే సరికి మూడు సార్లు ఈ మందును చల్లాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. అంటే దీని ప్రకారం ప్రతియేటా ఒక్క రైతు కనీసం 20 నుంచి 25 లీటర్ల గ్లైపోసెట్‌ను వినియోగిస్తున్నట్లు లెక్క.

అక్రమార్కులకు కాసుల వర్షం..

గ్లైపోసెట్‌ మందుల కోసం డిమాండ్‌ అధికంగా ఉండడం మార్కెట్‌లో అధికారికంగా అందుబాటులో లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలో ఐదు లీటర్ల క్యాన్‌ను రూ.2500 కు కొనుగోలు చేసి ఇక్కడ రైతులకు రూ.3000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో 20 లీటర్ల గ్లైపోసెట్‌కు రూ.9200 ధర పలుకుతుండగా అదే మందు ఇక్కడికి తీసుకువచ్చి రైతులకు రూ.11000 నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. ఇక స్వల్ప పరిమాణంలో అవసరమైన రైతులకు లీటరుకు రూ.600 విక్రయిస్తుంటే అర లీటరు రూ.400 ధర నిర్ణయించి దొడ్డి దారిన విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్లైపోసెట్‌తో భూసారానికీ ప్రమాదమే

కలుపు నివారణ కోసం ఉపయోగిస్తున్న గ్లైపో సెట్‌ మందు పర్యావరణానికి తీవ్ర ముప్పు కలగ జేస్తుందని వ్యవసాయ నిపుణులు తేల్చారు. అమె రికా వంటి పాశ్చాత్య దేశాల్లో గ్లైపోసెట్‌ను ఐదేళ్ల క్రితమే పూర్తిగా నిషేధించగా మన దేశంలో ఇప్పటికీ దీనిపై నిషేధం లేదు. గ్లైపోసెట్‌ వాడకం వల్ల హెర్బి సైడ్‌ నియంత్రణ మాట ఎలా ఉన్నా ఈ మందు ప్రభావంతో ఇతర పంటలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా గ్లైపోసెట్‌ రసాయనిక గాఢత వల్ల నేలలోని మైక్రో ఆర్గాన్స్‌ దారుణంగా దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా భూసారం తగ్గిపోయి ఈ నేలల్లో ఇతర పంటలు సాగు చేసినప్పుడు రసాయనిక అవశేషాల వల్ల ఆహార పంటలు, కూర గాయల పంటలు కలుషితమై పోయి క్యాన్సర్‌కు దారి తీసే పరిస్థితి అధికమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ మందు విక్రయాలపై తెలంగాణలో నిషేధం ఉన్నప్పటికీ దొడ్డిదారిన జిల్లాాకు చేరుతోంది. దీని మూలాలు, ఆంధ్ర, గుజరాత్‌, మహారాష్ట్రల్లో ఉండగా ఇక్కడి ఆంధ్ర బాయ్ చీకటి స్మగ్లర్లు, ఓ రాజకీయ నాయకుని అండదండలతో ఆయా కంపెనీలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లైసెన్స్‌డ్‌ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించినప్పటికీ,‌ (స్మగ్లర్లు) ఆంధ్ర బాయ్ దందాను అరికట్టలేకపోయారు, సంబంధిత అధికారులు ఆంధ్ర బాయ్ దందాను అరికట్టి సరిహద్దు వంతెనపై చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story