కేంద్ర కేబినెట్ విప్లవాత్మక నిర్ణయాలు: సెమికాన్ 2.0, మొబైల్ పీఎల్ఐకి ఆమోదం

by Kema Shiva Kumar |

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మొత్తం ఏడు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.

కేంద్ర కేబినెట్ విప్లవాత్మక నిర్ణయాలు: సెమికాన్ 2.0, మొబైల్ పీఎల్ఐకి ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా, మౌలిక వసతుల రంగాన్ని పరుగులు పెట్టించేలా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో మొత్తం 7 ప్రధాన నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. అందుక సంబంధంచిన నిర్ణయాల వివరాలను కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ముందుకుగా వారణాసిలో సరికొత్త పద్ధతిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు కేబినెట్ మొదటి రెండు నిర్ణయాల ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ నది ఒడ్డున ర్యాంప్‌లు, లూప్‌లతో కూడిన 43.218 కిలోమీటర్ల పొడవైన 6/4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఇక నేషన్ హైవే 31 (NH-31)ని, వారణాసి రింగ్ రోడ్‌తో లింక్ చేసే ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద రూ.10,998.32 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్నారు.

గ్లోబల్ టెక్ హబ్‌గా భారత్ - సెమికాన్ 2.0, మొబైల్ PLI

అదేవిధంగా సాంకేతిక రంగంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కేబినెట్ మరో మూడు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. సెమికాన్ మిషన్ 2.0లో భాగంగా దేశీయంగా చిప్‌ల తయారీని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ‘ఇండియా సెమికాన్ మిషన్’ రెండో విడతకు కేబినెట్ ఏకంగా రూ.1.27 లక్షల కోట్లను మంజూరు చేసింది. ఇక దేశాన్ని మొబైల్ ఉత్పత్తి హబ్‌గా మార్చే లక్ష్యంతో, మొబైల్ ఫోన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ రెండో విడత కోసం రూ.62,500 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. ఎరువుల కొరత లేకుండా దేశాన్ని యూరియా ఉత్పత్తిలో స్వావలంబన వైపు నడిపించేందుకు నూతన ‘నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ ఫర్ యూరియా’కు ఆమోదముద్ర వేశారు.

రైల్వే నెట్‌వర్క్ ఆధునికీకరణ..

దేశవ్యాప్తంగా రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు కేబినెట్ ఆఖరి రెండు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పలు ప్రధాన మార్గాల్లో రైల్వే ట్రాక్‌ల డబ్లింగ్, నాలుగో రైల్వే లైన్ నిర్మాణ పనులను భారీ ఎత్తున చేపట్టేందుకు ప్రతిపాదనలను ఆమోదించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం సరికొత్త పుంతలు తొక్కనుంది. మౌలిక వసతుల కల్పన, రైల్వేల ఆధునికీకరణతో పాటు సెమీ కండక్టర్ రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించడమే కాకుండా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Next Story