రమణమూర్తిపై దాడిని ఖండించిన పీఠాధిపతులు, ప్రజా సంఘాల నేతలు

by Ratna Kumari |

హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ (హెచ్‌పీఈ) ప్రధాన కార్యదర్శి, జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవిహారం సంపాదకుడు రమణమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

రమణమూర్తిపై దాడిని ఖండించిన పీఠాధిపతులు, ప్రజా సంఘాల నేతలు
X

దిశ, హిమాయత్‌నగర్ : హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ (హెచ్‌పీఈ) ప్రధాన కార్యదర్శి, జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవిహారం సంపాదకుడు రమణమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పీఠాధిపతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. సమావేశంలో రమణమూర్తి మాట్లాడుతూ.. తాను హిందువుగా పుట్టానని, హిందువుగానే చివరి వరకు ఉంటానని స్పష్టం చేశారు. హిందూమతానికి హాని కలిగించే చర్యలను ప్రశ్నించినందుకే తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఇలాంటి దాడులకు భయపడబోనని, విద్వేషం, అసమానత్వం లేని హిందూమతంలోని సనాతన విలువలను పరిరక్షించేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని పేర్కొన్నారు. మతాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని, ప్రతి మతం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆయన అన్నారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, హిందూమతంలోని అసలైన విలువలను ఆధారాలతో వివరిస్తున్న రమణమూర్తిపై మతోన్మాద శక్తులు దాడికి పాల్పడటం ఆందోళనకరమన్నారు. ఆయనకు ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ విజయశంకర స్వామి మాట్లాడుతూ.. హైందవంలో విద్వేషానికి స్థానం లేదని, రమణమూర్తిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆధ్యాత్మిక ప్రవచనకారుడు దరూరి నరసింహాచార్యులు మాట్లాడుతూ, కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం చిత్రంలో రాజకీయ నాయకుడి ముఖాన్ని ఉపయోగించడం సరికాదని, దానిని ప్రశ్నించిన రమణమూర్తి నిజమైన హిందువని అభిప్రాయపడ్డారు.

బిర్లా మందిర్ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడుతూ.. హిందూమత మూలాలను అధ్యయనం చేసిన వ్యక్తిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమని, మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో హెచ్‌జీఆర్‌ఎస్ అధ్యక్షులు ఇనాయత్ అలీ బాఖ్రీ, చినుకు సాంస్కృతిక సంస్థ ప్రతినిధి మూర్తి, విజయ్ రెడ్డి, షిరిడి సాయి శ్రీనివాస్, సామాజిక ఉద్యమకారిణి లుబ్నా సర్వాత్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు స్కైలాబ్ బాబు, సీపీఎం రాష్ట్ర నాయకులు పి. రాములు, ప్రమోద్, ఉస్మానియా విశ్వవిద్యాలయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story