నిమిషాల్లో ఇంటికి గ్యాస్ సిలిండర్.. హెచ్‌పీసీఎల్‌ (HPCL)తో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ జోడీ!

by Ramesh Naini |   (  Updated:2026-07-15 12:08:04  IST  )

నిత్యావసర సరుకుల డెలివరీలో దూసుకుపోతున్న ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌’ కస్టమర్ల కోసం మరో వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది.

నిమిషాల్లో ఇంటికి గ్యాస్ సిలిండర్.. హెచ్‌పీసీఎల్‌ (HPCL)తో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ జోడీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిత్యావసర సరుకుల డెలివరీలో దూసుకుపోతున్న ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌’ (Swiggy Instamart) కస్టమర్ల కోసం మరో వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యాప్‌లో ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే వంటగ్యాస్‌ (LPG) సిలిండర్‌ను డెలివరీ చేసేందుకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఓ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇలా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం ఇదే తొలిసారి.

ఎలాంటి సిలిండర్లు దొరుకుతాయి?

జాతీయ మీడిమా సమాచారం ప్రకారం.. ఈ ఆన్‌ డిమాండ్ సిలిండర్ డెలివరీ సేవలను ప్రాథమిక దశలో బెంగళూరులో ప్రారంభించారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా హెచ్‌పీసీఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన 10 కిలోల ‘హెచ్‌పీ నవ్య’ (HP Navya) కాంపోజిట్ సిలిండర్‌ను, 5 కిలోల సాధారణ సిలిండర్‌ను కస్టమర్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నవ్య సిలిండర్ పారదర్శకంగా ఉండటం వల్ల లోపల గ్యాస్ ఎంతుందో సులభంగా చూసుకోవచ్చు.

కనెక్షన్ అవసరం లేదు..

ఈ సేవల ద్వారా సిలిండర్ పొందడానికి ముందుగా మీకు ఎలాంటి గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిన పని లేదు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి అద్దెకుండే విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న కుటుంబాలకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఆర్డర్ మరియు డెలివరీ విధానం

మొదటిసారి తీసుకునే వారికి దీన్ని కొత్త సిలిండర్ కొనుగోలుగా పరిగణిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా, కస్టమర్లు యాప్‌లో తమ గుర్తింపు కార్డు (ID Verification) వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. తదుపరి రీఫిల్ ఆర్డర్ల సమయంలో డెలివరీ బాయ్‌కి ఖాళీ సిలిండర్‌ను అప్పగించి (Swap విధానం) గ్యాస్ నింపిన కొత్త సిలిండర్‌ను తీసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ల రవాణాలో ప్రమాదాలు జరగకుండా కఠిన నిబంధనలు పాటిస్తున్నారు. స్విగ్గీ యాప్‌లో ఆర్డర్ రాగానే, అది నేరుగా స్థానిక హెచ్‌పీసీఎల్ ఏజెన్సీకి వెళుతుంది. వారి అధీకృత డిస్ట్రిబ్యూటర్ల నెట్‌వర్క్ ద్వారా, శిక్షణ పొందిన సిబ్బందితో మాత్రమే డెలివరీని పూర్తి చేస్తారు. కస్టమర్లకు కిరాణా సరుకులే కాకుండా, అత్యవసరమైన గృహ సేవలను కూడా సురక్షితంగా, నమ్మకంగా నిమిషాల్లోనే అందిస్తున్నామని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓ అమితేష్ ఝా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Next Story