పవర్ ప్లాంటులో మద్యం దందా.. కీలకంగా ఆ ఇద్దరే

by Batti.Sumithra |

విద్యుత్ పవర్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తిని పెంచి అందరికీ కరెంట్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పవర్ ప్లాంటులో మద్యం దందా.. కీలకంగా ఆ ఇద్దరే
X

దిశ, నల్లగొండ బ్యూరో: విద్యుత్ పవర్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తిని పెంచి అందరికీ కరెంట్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే గత ప్రభుత్వ ఆధ్వర్యంలో దామరచర్ల మండలం వీర్లపాలెం, తాళ్ల వీరప్పగూడెం గ్రామాల పరిధిలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అయితే అక్కడ విద్యుత్ ఉత్పత్తికి బదులుగా మద్యం ఏరులై పారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి విక్రయాలు చేస్తున్నారని, కొంతమంది వ్యక్తులు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మద్యం వ్యాపారానికి అడ్డాగా మార్చారనే సమాచారం ఉంది.

పవర్ ప్లాంటులో మద్యం సరఫరా..

యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో బీహార్, రాజస్థాన్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాలతో పాటు స్థానిక ప్రాంతాలకు చెందిన సుమారు 5 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అదే క్రమంలో పవర్ ప్లాంటు సమీపంలో సుమారు 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. సహజంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మద్యం అలవాటు ఉన్నవారు అధికంగా ఉండటంతో, వారి బలహీనతను ఆసరాగా చేసుకుని ప్లాంటులోనే మద్యం వ్యాపారం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.

అయితే ఆ పరిసరాల్లో ఉన్న బెల్ట్ షాపుల్లో ఒక షాపు నుంచి క్రమం తప్పకుండా మద్యం అక్రమంగా ప్లాంటులోకి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ఫుల్ బాటిళ్లకు బదులుగా కేవలం క్వార్టర్ సీసాలనే ప్లాంటులోకి తరలిస్తున్నట్లు సమాచారం. పెద్ద బాటిళ్లు తీసుకెళ్లడం కష్టమవుతుండటంతో పాటు, అక్కడ పనిచేసే కార్మికులు చిన్న సీసాలను సులభంగా కొనుగోలు చేయగలరనే ఉద్దేశంతో క్వార్టర్ బాటిళ్లను ఎక్కువగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్లాంటు బయట ఉన్న బెల్ట్ షాపుల్లో క్వార్టర్ బాటిల్‌ను ఎంఆర్పీ ధర కంటే రూ.20 అదనంగా విక్రయిస్తుండగా, పవర్ ప్లాంటులో మాత్రం అదే క్వార్టర్ సీసాను ఎంఆర్పీ ధర కంటే రూ.40 ఎక్కువకు విక్రయిస్తున్నట్లు వినికిడి. రోజుకు దాదాపు 50 కార్టన్‌లకు పైగా మద్యం విక్రయిస్తున్నారని సమాచారం. దీంతో పెద్దఎత్తున అక్రమ ఆదాయం సమకూరుతున్నట్లు తెలుస్తోంది.

కీలకంగా ఆ ఇద్దరే..

విద్యుత్ పవర్ ప్లాంటులో మద్యం సరఫరా వ్యవహారంలో ఓ అధికారి కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఆ అధికారికి అనుచరుడిగా ఉన్న ఓ ప్రైవేట్ వ్యక్తి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వినికిడి. పవర్ ప్లాంటులోకి వెళ్లేందుకు, బయటకు రావడానికి అవసరమైన గేట్ పాస్‌ల జారీ బాధ్యత వారిదే కావడంతో, మద్యం సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా పోయిందని సమాచారం. ఇదిలా ఉండగా, ఆ ప్రైవేట్ వ్యక్తి తాను ఏర్పాటు చేసుకున్న కోటరీ ద్వారా మద్యాన్ని ప్లాంటులోకి పంపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమ మద్యం విక్రయాల ద్వారా ప్రతి నెల వేలాది రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ దందాను అడ్డుకునే సాహసం ఎవరూ చేయకుండా చూస్తూ ఊరుకుంటున్నారనే వినికిడి ఉంది.

Next Story