బహుదూర్‌గూడ రైతులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలి

by Ratna Kumari |

బహుదూర్‌గూడ గ్రామ రైతుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వర్ష పద్మ డిమాండ్ చేశారు.

బహుదూర్‌గూడ రైతులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలి
X

దిశ, చేవెళ్ల : బహుదూర్‌గూడ గ్రామ రైతుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వర్ష పద్మ డిమాండ్ చేశారు. చేవెళ్లలోని ఏఆర్ ఫుడ్ హోటల్‌లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్ ఎం. సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వర్ష పద్మ మాట్లాడుతూ.. గత 70 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూముల విషయంలో బహుదూర్‌గూడ రైతులు న్యాయం కోసం పోరాడుతున్నారని తెలిపారు. సుమారు 1,400 ఎకరాల భూమిలో 650 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం రైతులకు అన్యాయమని ఆరోపించారు. ఈ భూముల అంశంపై రైతులు న్యాయపోరాటం చేసి హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ, తొమ్మిది నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కోర్టు ఆదేశాలను గౌరవించకుండా రైతులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

ఎకరం, రెండు ఎకరాల భూమిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వం వారితో చర్చలు జరిపి, అవసరమైతే తగిన నష్టపరిహారం అందించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ప్రభులింగం, రైతు నాయకులు వెంకటేశం, పెంటయ్య, జిల్లా అధ్యక్షుడు, చేవెళ్ల మండల సీపీఐ నాయకులు సాయి, కార్యదర్శి ఎండి మార్బుల్, వికారాబాద్ జిల్లా సీపీఐ కార్యదర్శి విజయలక్ష్మి పండిత్, ఎం.డి. షఫీ తదితరులు పాల్గొన్నారు.

Next Story