తెలంగాణ ఉద్యమకారులతో గుర్తింపు కమిటీ ముఖాముఖి

by Vemula.Srinu Prasad |

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అర్హులైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు జరుపుతున్న సమావేశాల్లో భాగంగా బుధవారం తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం)లో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మరియు ఆదిలాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ..

తెలంగాణ ఉద్యమకారులతో గుర్తింపు కమిటీ ముఖాముఖి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అర్హులైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు జరుపుతున్న సమావేశాల్లో భాగంగా బుధవారం తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం)లో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మరియు ఆదిలాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కమిటీ చైర్మన్ కే. కేశవరావు, సభ్యులు ప్రొ. ఎమ్. కోదండరామ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ లు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఉద్యమకారులు తమ సలహాలను, సూచనలను కమిటీకి ఇచ్చారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఉద్యమకారులు స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. పాలకుల వివక్షకు వ్యతిరేకంగా అడవి బిడ్డల నుండి పట్టణ శ్రేణుల వరకు, విద్యార్థి లోకం, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు సరిహద్దు జిల్లాల్లో రహదారులను స్తంభింపజేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారని, ఆనాటి పోరాట పటిమే నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బలమైన పునాది వారు తెలిపారు.

ఈ సందర్బంగా పలు అంశాలను, డిమాండ్లను కమిటీ ముందు పెట్టారు. సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి నివాస అవసరాల నిమిత్తం 250 గజాల భూమిని ఉచితంగా కేటాయించి రిజిస్ట్రేషన్ చేయించాలి. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించడానికి గౌరవప్రదమైన నెలవారీ జీవితకాల పెన్షన్ అందించాలి. నాటి పోరాటంలో చదువులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన ఉద్యమకారుల పిల్లలకు విద్యా సంస్థల అడ్మిషన్లలో మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక కోటా కల్పించాలి. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహిళా పోరాట యోధులకు ప్రత్యేక స్వయం ఉపాధి పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్య సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయాలి. గుర్తింపు పొందిన ఉద్యమకారుల పిల్లలకు లేదా వారి తదుపరి తరానికి కేజీ నుండి పీజీ వరకు పూర్తి ఉచిత విద్యను అందించాలి. వృద్ధాప్యంలో ఉన్న ఉద్యమకారులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో జీవితకాల ఉచిత ప్రయాణ రవాణా పాస్ సౌకర్యం కల్పించాలి వంటి డిమాండ్లపైన కమిటీతో చర్చించారు.

ఈ సందర్భంగా కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ పోరాట గడ్డల నుండి వచ్చిన ప్రతి ఒక్కరి ఆవేదనను, డిమాండ్లను కమిటీ సానుకూలంగా రికార్డ్ చేసిందని, ఈ సంక్షేమ అంశాలు ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని, మీ ఆత్మగౌరవ హక్కు అని అన్నారు. ఐ అండ్ పీఆర్ ద్వారా జరుగుతున్న పూర్తి స్థాయి డిజిటల్ రికార్డింగ్ సాక్షిగా, ఒక్క నిజమైన ఉద్యమకారుడికి కూడా అన్యాయం జరగకుండా చూస్తామని కమిటీ భరోసా ఇచ్చింది. జూలై 22 వరకు ఈ ముఖాముఖి సంప్రదింపుల షెడ్యూల్ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. కాగా, నేడు మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల ఉద్యమకారులతో కమిటీ సమావేశం కానున్నది.

Next Story