సీతమ్మసాగర్‌ అనుమతులపై ఫోకస్.. కేంద్రంతో సంప్రదింపులు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు...

సీతమ్మసాగర్‌ అనుమతులపై ఫోకస్.. కేంద్రంతో సంప్రదింపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సెక్రెటేరియట్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీతారామ ఎత్తిపోతల పథకంతోపాటు సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై ఇరువురు మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌అండ్‌సీసీ) అనుసరిస్తున్న ప్రామాణిక కార్యాచరణకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉండటంతో మార్చి 2023 నుంచి ప్రాజెక్టు పనులు నిలిచిపోయిన సంగతిని గుర్తుచేశారు. ఈ న్యాయపరమైన చిక్కులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా, పర్యావరణ అనుమతులు మంజూరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ కృషి చేస్తున్నదని వివరించారు. అనుమతులు లభించిన వెంటనే పనులు పునఃప్రారంభమై, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతాంగానికి సాగునీటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు.

దోమలవాగుపై నిల్వ సామర్థ్యం పెంపు

సీతారామ ఎత్తిపోతల పథకంలో పంప్‌హౌస్-1, పంప్‌హౌస్-2 మధ్య దోమలవాగుపై ప్రస్తుతం ఉన్న 0.20 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.50 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించినట్లు తుమ్మల తెలిపారు. నిల్వ సామర్థ్యం పెరిగితే ఎత్తిపోతల పథకం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, రెండు పంప్‌హౌస్‌ల మధ్య నీటి లభ్యత స్థిరంగా ఉంటుందని మంత్రి వివరించారు. ఈ ప్రతిపాదనకు నీటిపారుదల శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. అలాగే.. సీతారామ ప్రధాన కాలువపై పంప్‌హౌస్-1, 2, 3 మధ్య అవసరమైన చోట్ల ఎస్కేప్ రెగ్యులేటర్ల ఏర్పాటు అంశంపైనా విస్తృతంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. అధిక ప్రవాహాన్ని నియంత్రించడం లక్ష్యంగా అవసరమైన సాంకేతిక పరిశీలనలు చేపట్టాలని అధికారులను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించినట్లు వివరించారు. సత్తుపల్లి ట్రంక్ కాలువలోని యాతలకుంట సొరంగం తవ్వకం పూర్తయిందని, ప్రస్తుతం లైనింగ్ పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. 2026 ఆగస్టు నాటికి లైనింగ్ పూర్తి చేసి నీటి విడుదలకు సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సొరంగం పూర్తయితే సత్తుపల్లి ప్రాంత రైతాంగానికి సాగునీటి లభ్యత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

అలాగే.. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పరిహార చెల్లింపులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి కోరగా, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అత్యధిక భూములు ఆయిల్‌పామ్ సాగులో ఉన్నందున, సంప్రదాయ డిస్ట్రిబ్యూటరీ కాలువలకు బదులు పైపుల ద్వారా సాగునీటి పంపిణీ (పైప్డ్ ఇరిగేషన్ నెట్‌వర్క్) సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. సీతారామ ప్రధాన కాలువపై జూలూరుపాడు సొరంగం నిర్మాణం వివిధ కారణాలతో నిలిచిపోయిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ పనులను ప్రాధాన్యతతో పునఃప్రారంభించి, పాలేరు జలాశయానికి వీలైనంత త్వరగా నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని కోరగా, నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.

Next Story