- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూర్ బిల్లుపై ఫెడరేషన్ కీలక సూచనలు
క్యూర్ బిల్లు-2026పై ఫెడరేషన్ అభ్యంతరాలు. ఆస్తి పన్ను పెంపును దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.

దిశ, గండిపేట : క్యూర్ బిల్లు–2026పై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అల్ కాలనీస్ ఫెడరేషన్ (బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పూర్, హైదర్‌షాకోట్ వార్డులు 121, 122, 123) ప్రతినిధులు పలు కీలక సూచనలు, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి నరేందర్ బాబు, ప్రతినిధి విజయ్ పద్మనాభన్ సమావేశంలో పాల్గొని, కొత్త సీవీఎస్ (CVS) విధానం అమలుతో ఆస్తి పన్ను మూడు నుంచి ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.4,500 ఆస్తి పన్ను చెల్లిస్తున్న 150 చదరపు గజాల ఇంటికి కొత్త విధానంలో రూ.17 వేల నుంచి రూ.22 వేల వరకు పన్ను విధించే అవకాశం ఉందని వివరించారు. పన్ను పెంపును సంవత్సరానికి 20 నుంచి 30 శాతానికి మాత్రమే పరిమితం చేయాలని, సీనియర్ సిటిజన్లు, స్వయంగా నివసించే గృహ యజమానులు, 100 చదరపు గజాల లోపు ఇళ్లకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని ఫెడరేషన్ కోరింది.
అలాగే కొత్త విధానాన్ని దశలవారీగా అమలు చేయడంతో పాటు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు (ఆర్‌డబ్ల్యూఏ) చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని, అదనంగా వసూలయ్యే పన్నులో కొంత భాగాన్ని కాలనీల అభివృద్ధికి కేటాయించాలని సూచించింది. పెనాల్టీ వడ్డీని 12 శాతానికి పరిమితం చేయడం, ఒకేసారి అమ్నెస్టీ పథకం అమలు చేయడం, సింగిల్ బిల్లింగ్ పోర్టల్, వాట్సాప్ అలర్ట్‌లు, నీటి ఎస్క్రో ఖాతాల ఆడిట్, నెలకు 10 కిలోలీటర్ల వరకు ఉచిత నీటి సరఫరా, క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆర్‌డబ్ల్యూఏలకు రెండు స్థానాలు కల్పించాలని ప్రతిపాదించింది. ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను చెల్లింపుతో పాటు ఆస్తి బీమా ఎంపికను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి నరేందర్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం పన్నులు పెంచితే, ఆ నిధుల వినియోగంపై రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు కూడా నిర్ణయాధికారం కల్పించాలని అన్నారు. అప్పుడే సంస్కరణలు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. జూలై 24, 2026 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఫెడరేషన్ సమర్పించిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.






