- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిందిస్థాయి అధికారుల మెడకు ఉచ్చు.. పైస్థాయి సేఫ్ గేమ్ ?
దమ్మపేట ఏజెన్సీలో కలకలం రేపిన నకిలీ మరణ, వారసత్వ ధ్రువీకరణ పత్రాల కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, దమ్మపేట : దమ్మపేట ఏజెన్సీలో కలకలం రేపిన నకిలీ మరణ, వారసత్వ ధ్రువీకరణ పత్రాల కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బతికున్న రైతును కాగితాల్లో చనిపోయినట్లు చూపించి, ఐదెకరాల భూమిని కాజేసిన ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగం పోలీసులను ఆశ్రయించింది. అయితే, ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు తమ బాధ్యతను పక్కనపెట్టి, కేవలం కిందిస్థాయి సిబ్బందిని మాత్రమే చూపిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు.. అందులో ఏముందంటే..
పెద్దగొల్లగూడెం సర్వేనెంబర్ 385/54లో ఉన్న మళ్లా సత్యంకు చెందిన ఐదు ఎకరాల భూమి బదలాయింపు వ్యవహారంలో మోసం జరిగిందని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని దమ్మపేట తహసీల్దార్ రామ్ నరేష్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. మళ్లా సత్యం 2018లో చనిపోయినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, ఆయనకు ఒక్కరే సంతానమని పేర్కొంటూ నామా పుష్పావతి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుందని అందులో పేర్కొన్నారు. దీనిపై కనీస విచారణ చేయకుండా గ్రామ పాలన అధికారి (వీఏఓ) వి. అనంతమ్మ తప్పుడు నివేదిక ఇచ్చి అక్రమంగా పాస్‌బుక్ ఇప్పించారని తహసీల్దార్ ఆరోపించారు. అలాగే, ఈ నకిలీ పత్రాలపై తహసీల్దార్, గిర్దావర్ సంతకాలను మార్ఫింగ్ (ఫోర్జరీ) చేశారని, దొంగ సాక్షులు సంతకాలు చేశారని ఫిర్యాదులో వివరించారు. ఈ కుట్రకు పాల్పడిన నామా పుష్పావతి, వీఏఓ అనంతమ్మ, ఇద్దరు సాక్షులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కోరారు.
సంతకాల మార్ఫింగ్ పై వ్యక్తమవుతున్న సాంకేతిక అనుమానాలు..
తహసీల్దార్ ఇచ్చిన ఈ ఫిర్యాదుపై ఇప్పుడు ప్రజల్లో పలు సాంకేతిక, తార్కిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ ఆన్‌లైన్ వ్యవస్థలో ఫైల్ ఆమోదం పొందాలంటే తహసీల్దార్ స్థాయిలో డిజిటల్ ఆమోదం (బయోమెట్రిక్ లేదా ఓటీపీ ద్వారా) తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ఏయే పత్రాలు అప్‌లోడ్ అయ్యాయో ఆన్‌లైన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు, "మా సంతకాలు మార్ఫింగ్ చేశారు" అని ఫిర్యాదులో పేర్కొనడం ద్వారా ఉన్నతాధికారులు తమ ఆన్‌లైన్ బాధ్యత నుంచి ఎలా తప్పించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.
సూత్రధారులను రక్షించేందుకేనా..?
ఈ భూ కుంభకోణం వెనుక పెద్ద మాఫియా నెట్‌వర్క్ ఉందనే ఆరోపణలు మొదటి నుంచే వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేవలం వీఏఓ, దరఖాస్తుదారు, ఇద్దరు దొంగ సాక్షులపై మాత్రమే ఫిర్యాదు చేయడం ద్వారా తెరవెనుక ఉండి కథ నడిపించిన అసలు సూత్రధారులను రక్షించే ప్రయత్నం జరుగుతోందా? అనే గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి. పోలీసులు కేవలం రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు పత్రానికే పరిమితం కాకుండా, ఆన్‌లైన్ లాగిన్‌లు, ఆమోదాలు ఎలా జరిగాయనే సాంకేతిక అంశాలపై కూడా లోతైన దర్యాప్తు జరపాలని మండల ప్రజలు కోరుతున్నారు. సమగ్ర విచారణ జరిగితే తప్ప ఈ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం వెనుక ఉన్న అసలు నిజాలు, వ్యవస్థాపరమైన లోపాలు వెలుగులోకి రావని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.






