రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. 20 ఏళ్ల తర్వాత సరికొత్త రూపంలో IRCTC వెబ్‌సైట్

by Kema Shiva Kumar |

రెండు దశాబ్దాల తర్వాత ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ కొత్త రూపం దాల్చింది.

రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. 20 ఏళ్ల తర్వాత సరికొత్త రూపంలో IRCTC వెబ్‌సైట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ప్రయాణికులకు టికెట్ బుకింగ్ సులభతరం చేస్తూ భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన అధికారిక వెబ్‌సైట్‌ను సరికొత్త డిజైన్‌తో అప్‌గ్రేడ్ చేసింది. గత రెండు దశాబ్దాలలో ఈ ప్లాట్‌ఫామ్‌లో జరిగిన అతిపెద్ద మార్పు ఇదేనని ఇవాళ రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ సరికొత్త వెబ్‌సైట్‌కు సంబంధించిన బీటా (Beta) వెర్షన్‌ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చారు. పూర్తిస్థాయి వెబ్‌సైట్‌ను లాంచ్ చేయడానికి ముందే ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించడానికి దీనిని లైవ్ చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ హోమ్‌పేజీలోనే ఈ కొత్త పోర్టల్‌ను పరిశీలించడానికి ప్రత్యేక లింక్ అందించారు.

వెబ్‌సైట్‌లో అసలు ఏం మారాయంటే..

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ 2002లో ప్రారంభం కాగా ప్రస్తుతం రోజుకు సగటున దాదాపు 14.5 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి. ప్రయాణికులకు బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త సైట్‌లో చాలనే మార్పులు చేశారు. టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టే అనవసరమైన క్యాప్చాలు, పాప్-అప్ అడ్వర్టైజ్మెంట్లు, స్క్రీన్‌పై ఫ్లాష్ అయ్యే గ్రాఫిక్స్ వంటి డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ కొత్త వెబ్‌సైట్ నుంచి తొలగించారు. అన్ని ట్రావెల్ క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యత (Seat Availability) వివరాలు ఒకేచోట స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఏ క్లాసులో టికెట్ ఖాళీగా ఉందో సులభంగా పోల్చి చూసుకోవచ్చు. టికెట్ బుకింగ్ పూర్తి చేయడానికి అవసరమైన స్టెప్స్‌ను తగ్గించారు. అంతేకాకుండా, గతంలో సేవ్ చేసుకున్న ప్రయాణికుల వివరాల (Saved Passenger Details) ద్వారా తదుపరి సారి టికెట్లను మరింత వేగంగా బుక్ చేసుకోవచ్చు. రైల్వే డిజిటల్ టికెటింగ్ వ్యవస్థను ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT) విద్యార్థుల ఈ కొత్త ఐఆర్‌సీటీసీ డిజైన్ రూపుదిద్దుకుంది.

Next Story