- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nitin Gadkari: వినియోగదారులు ప్యూర్ పెట్రోల్ కూడా కొనుగోలు చేయొచ్చు
ఒకవేళ ఇథనాల్ కలిపిన ఇంధనం ఇష్టం లేని వాహనదారులు ఉంటే, వారికి మరో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) వివాదంపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్లు పాడవుతున్నాయని వస్తున్న ఫిర్యాదులను ఆయన తోసిపుచ్చారు. ఒకవేళ ఇథనాల్ కలిపిన ఇంధనం ఇష్టం లేని వాహనదారులు ఉంటే, వారికి మరో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. 'ఈ20 వద్దు అనుకునే వారు 100 శాతం ప్యూర్ పెట్రోల్‌ను ఎంచుకోవచ్చు, కానీ దానికి వారు లీటరుకు సుమారు రూ. 167 నుండి రూ. 170 రూపాయల వరకు (సాధారణ ధర కంటే 60 శాతం ఎక్కువ) భారీగా చెల్లించాల్సి ఉంటుంది' అని గడ్కరీ తేల్చి చెప్పారు. దేశంలో లభించే ఎక్స్‌పీ100 వంటి హై-ఆక్టేన్ ఇంధనాల్లో ఇథనాల్ దాదాపు ఉండదని, అయితే వీటి ధరలు సామాన్యుడికి భారం కావడం వల్లే ప్రభుత్వం పర్యావరణ అనుకూలమైన, చౌకైన ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రోత్సహిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
త్వరలో 'ఫ్లయింగ్ బస్సులు'
ఇదే సమయంలో దేశ రవాణా రంగాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్చే సరికొత్త ప్రాజెక్టులపై గడ్కరీ మాట్లాడారు. లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి త్వరలో 'ఫ్లయింగ్ బస్సులను' (ఎగిరే బస్సులు) అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దేశంలో నీటిపై దిగే సీప్లేన్‌లను ఇప్పటికే తీసుకొచ్చామని, స్వయంగా తానే అందులో ప్రయాణించినట్టు గడ్కరీ పేర్కొన్నారు. దీని తర్వాత విద్యుత్‌తో నడిచే ఎగిరే బస్సులపైనే తన దృష్టి ఉందని ఆయన స్పష్టం చేశారు.
కుమారుల వ్యాపారంపై క్లారిటీ
ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం వెనుక నితిన్ గడ్కరీకి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విమర్శలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని, తనపై బురద జల్లడానికే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఆయుధంగా వాడుతున్నారని మండిపడ్డారు. 'నా కుమారుల వ్యాపారంలో ఇథనాల్ అనేది చాలా చిన్న భాగం మాత్రమే. దేశంలో జరుగుతున్న మొత్తం ఉత్పత్తిలో వారి సహకారం నామమాత్రం' అని గడ్కరీ స్పష్టం చేశారు. వారి వ్యాపారానికి దాదాపు రూ. 1,600 కోట్ల అప్పు ఉందని, దానికి సంబంధించిన ధరల నిర్ణయం లేదా కొనుగోలు ప్రక్రియలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. దేశం ఏటా చమురు దిగుమతుల కోసం రూ. 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, ఆ భారాన్ని తగ్గించి దేశాన్ని ఆత్మనిర్భర్ మార్గంలో నడిపించడానికే ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు.






