నెహ్రూ నుంచి రాహుల్ వరకు ఓబీసీలకు అన్యాయమే: రాంచందర్ రావు ఆరోపణలు

by Ramesh Naini |

నెహ్రూ కాలం నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ (బీసీ) సామాజిక వర్గాలకు అడుగడుగునా ద్రోహం చేశాయని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నెహ్రూ నుంచి రాహుల్ వరకు ఓబీసీలకు అన్యాయమే: రాంచందర్ రావు ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నెహ్రూ కాలం నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ (బీసీ) సామాజిక వర్గాలకు అడుగడుగునా ద్రోహం చేశాయని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత సూరవరం శ్రీనివాస్ రచించిన ‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఓబీసీలకు చేసిందేమిటి?’ పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వెనుకబడిన వర్గాల పట్ల తీవ్రమైన వివక్ష మరియు వ్యతిరేక మైండ్‌సెట్ ఉందని రాంచందర్ రావు మండిపడ్డారు. దేశ ప్రధానిగా ఉన్న సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ 7 జూన్ 1961 న దేశ ముఖ్యమంత్రులకు స్వయంగా లేఖ రాస్తూ.. తాను రిజర్వేషన్లకు వ్యతిరేకమని, మెరిట్ దెబ్బతింటుందని, కాబట్టి రిజర్వేషన్ల విధానాన్ని అనుసరించవద్దని స్పష్టంగా పేర్కొన్నారని, ఇది పార్లమెంట్ రికార్డుల్లో ఉందని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందే తప్ప వారి సామాజిక అభ్యున్నతికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ‘కులాలను రాజకీయ అవసరాల కోసం, ఓట్ల వేట కోసం వాడుకోకూడదు. వెనుకబడిన కులాలను గుర్తించి, సామాజిక-ఆర్థిక సర్వేల ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంపొందించి సమాజంలో వారిని పైకి తీసుకురావడానికే రిజర్వేషన్లు ఉపయోగపడాలి’ అని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కులాల మధ్య కుంపట్లు పెడుతోందని విమర్శించారు.

బీసీ కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి

బీసీల హక్కుల కోసం రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఘనత కేవలం నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత తిరస్కరించబడి ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ దిశగా సాగుతోందని రాంచందర్ రావు పేర్కొన్నారు. బీసీలకు అడుగడుగునా మోసం, ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ప్రజలంతా గ్రహించారని తెలిపారు. ఇటు రాష్ట్రాల్లోనూ బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌ను తెలంగాణ గడ్డ నుంచి కూడా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ‘కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ’ను తీర్చిదిద్దాలని, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story