India-UK: అమల్లోకి వచ్చిన భారత్, యూకే వాణిజ్య ఒప్పందం

by S Gopi |

రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), కార్మికులు, స్టార్టప్‌లు, తయారీ రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

India-UK: అమల్లోకి వచ్చిన భారత్, యూకే వాణిజ్య ఒప్పందం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో యూకే మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు మరింత సులభంగా ప్రవేశం లభించనుండగా, ముఖ్యంగా రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), కార్మికులు, స్టార్టప్‌లు, తయారీ రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. యూకేకు వెళ్లే భారత ఎగుమతుల్లో దాదాపు 99 శాతం ఉత్పత్తులకు పన్ను రహిత ప్రవేశం లభించడం వల్ల టెక్స్‌టైల్స్, లెదర్, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మా, రసాయనాల వంటి రంగాలు ఎక్కువగా లాభపడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఒప్పందం భారత ఎగుమతులను పెంచడంతో పాటు దేశీయ తయారీ, ఉపాధికి కూడా ఊతమివ్వనుంది.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని 'చారిత్రాత్మక మైలురాయి'గా అభివర్ణించారు. ఈ ఒప్పందం వికసిత భారత్-2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా రైతులు, కార్మికులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. వస్తువులతో పాటు ఐటీ, కన్సల్టింగ్, ఆరోగ్య, విద్య వంటి సేవల రంగానికీ ఈ ఒప్పందం ప్రయోజనం చేకూరనుంది. అలాగే రెండు దేశాల మధ్య పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యం మరింత పెరుగుతాయని అంచనా. పరిశ్రమ వర్గాల ప్రకారం, ఈ ఒప్పందం ప్రభావంతో 2030 నాటికి భారత్-యూకే ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 120 బిలియన్ డాలర్ల(రూ. 11.54 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉంది. దీంతో అభివృద్ధి చెందిన మార్కెట్లలో భారత వ్యాపారాలకు మరింత బలమైన స్థానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story