ఆస్తి ఇవ్వలేదని తండ్రిని నరికి చంపిన కొడుకు అరెస్ట్

by Taduka Kalyani |   (  Updated:2026-07-15 16:35:13  IST  )

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మహబూబ్‌పల్లిలో జరిగిన తండ్రి హత్య కేసును పోలీసులు ఛేదించారు.

ఆస్తి ఇవ్వలేదని తండ్రిని నరికి చంపిన కొడుకు అరెస్ట్
X

దిశ, మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మహబూబ్‌పల్లిలో జరిగిన తండ్రి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు రవీందర్‌ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌పల్లికి చెందిన రత్నం సారయ్యను ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి సమయంలో అతని కుమారుడు రవీందర్ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాటారం సీఐ నాగార్జున రావు, మహాముత్తారం ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో యమనపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో రవీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆస్తి ఇవ్వకపోవడంతోనే తండ్రిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ రంజిత్ రావు, ఎస్సై రమేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని డీఎస్పీ సూర్యనారాయణ అభినందించారు.

Next Story