- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్‌వాడీల్లోనూ బ్రేక్‌ఫాస్ట్.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ 'బ్రేక్‌ఫాస్ట్' పథకాన్ని అమలు చేయనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ 'బ్రేక్‌ఫాస్ట్' పథకాన్ని అమలు చేయనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇది మంచి ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. సచివాలయం నుంచి బుధవారం జిల్లాల అధికారులతో సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లలకు పథకాలు అందించడమే కాకుండా, వారు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఎదిగేలా చూడటమే ప్రభుత్వ అసలు లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలని, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, మెరుగైన విద్యా వసతులు కల్పించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పునాది వేయాలని ఆదేశించారు.
నాసిరకం సరుకులిస్తే చర్యలు..
అంగన్‌వాడీలకు సరఫరా చేసే కోడిగుడ్లు, పప్పు, ఇతర పోషకాహార పదార్థాల్లో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నాసిరకం సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీల్లో భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించేందుకు డీడబ్ల్యూవోలు, సూపర్‌వైజర్లు అక్కడే భోజనం చేయాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన 2,500 కొత్త అంగన్‌వాడీ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, రాబోయే రోజుల్లో మరో 2,500 నుంచి 3,000 భవనాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
పారదర్శకంగా నియామక ప్రక్రియ..
అంగన్‌వాడీల్లో నియామక ప్రక్రియను పారదర్శకంగా, మెరిట్ ప్రాతిపదికన త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వలస కార్మికుల పిల్లల కోసం మరిన్ని మొబైల్ అంగన్‌వాడీలను ప్రారంభించాలని, గూడేల్లోని చిన్నారులకు కూడా ప్రభుత్వ సేవలు అందేలా చూడాలని సూచించారు. అంకితభావంతో పనిచేసే ఉత్తమ అంగన్‌వాడీ సిబ్బందిని గుర్తించి ఆగస్టు 15న సన్మానించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణను బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.






