విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు : పి.సుదర్శన్ రెడ్డి

by Batti.Sumithra |

ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధించడం ద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు.

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు : పి.సుదర్శన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధించడం ద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లాలో ఉత్తీర్ణత మెరుగుపడిందని, ఇదే స్పూర్తితో కృషి చేస్తూ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా చొరవ చూపాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా విద్యాశాఖ పనితీరు పై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, గురుకులాల నిర్వహణ తీరుతెన్నులు, సాధించిన ఫలితాలు, మౌలిక సదుపాయాల స్థితిగతులు తదితర అంశాల పై సమీక్ష జరిపి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

విద్యారంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చే విషయంలో ప్రభుత్వం ఎంతమాత్రం రాజీ పడబోదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్కో విద్యా సంస్థకు 200 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తూయంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తోందని, ఇవి కాకుండా అన్ని రకాల అధునాతన సదుపాయాలతో ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మిస్తోందని గుర్తుచేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేలా సాంకేతిక విద్యకు తోడ్పాటును అందిస్తోందని అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా తమ బాధ్యతను గుర్తెరిగి నాణ్యమైన విద్యను బోధిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రవేశాలు గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఆయా సబ్జెక్టులలో వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, నాణ్యమైన పౌష్టిక ఆహారం అందేలా చూడాలన్నారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తాము కృషి చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించాల్సిన బాధ్యత మాత్రం ఉపాధ్యయులదేనని స్పష్టం చేశారు. పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు వెనక్కి మళ్లిపోకుండా, ప్రతి పైసా వినియోగంలోకి వచ్చేలా నిర్దిష్ట గడువులోగా అదనపు తరగతి గదులు, ఇతర సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన పనులను పూర్తి చేయాలన్నారు.

కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ విద్యారంగంలో నిజామాబాద్ జిల్లా పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ప్రవేశాల విషయంలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఐదవ స్థానంలో ఉందని, ఈ నెలాఖరు వరకు లక్ష్యానికి అనుగుణంగా ప్రవేశాలు పూర్తి చేసి జిల్లాను ముందంజలో నిలుపుతామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 21 శాతం మేర ఎక్కువ ప్రవేశాలు జరిగాయని, నెలాఖరు నాటికి మరో 7 శాతం ప్రవేశాలు పెంపొందించేలా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్సీఓలు, జిల్లా అధికారులు సందర్శిస్తూ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందేలా ప్రతి పాఠశాలలో ఆహార భద్రతా కమిటీలను ఏర్పాటు చేయించామని తెలిపారు. బాలికల విద్యాలయాల్లో విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.

మెరుగైన విద్యా బోధన అందించడం వల్ల ఈసారి పదో తరగతిలో కేజీబీవీ, జ్యోతిబాపూలె, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయని వివరించారు. ఈ సందర్భంగా ఎస్సెస్సీలో టాపర్లుగా నిలిచిన లహరిక, సౌజన్య, సంజన, లాస్య, అభిజ్ఞ తదితరులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించగా, ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తన తరపున ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున నగదు పారితోషికం అందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ బడులలో విద్యార్థులు ప్రవేశాలను పెంపొందించేందుకు కృషి చేసిన ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులను సైతం సన్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం చైర్మన్ శేఖర్ గౌడ్, డీఈఓ అశోక్, డీఆర్డీఓ సాయాగౌడ్, విద్యా శాఖ అధికారులు, ఆర్సీఓలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story