- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MPMS: రూ.62,500 కోట్ల మొబైల్ పీఎల్‌ఐ 2.0కు కేబినెట్ ఆమోదం
ఐఎస్ఎం రెండో దశలో దేశీయంగా చిప్ డిజైన్, తయారీ, ప్యాకేజింగ్‌తో పాటు పరికరాలు, రసాయనాలు, ముడి పదార్థాల తయారీకి కూడా ప్రభుత్వం మద్దతు ఇవ్వనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ. 1.27 లక్షల కోట్లతో 'ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)' రెండో దశకు, అలాగే రూ. 62,500 కోట్లతో కొత్త 'మొబైల్ ఫోన్ తయారీ పథకం (ఎంపీఎంఎస్)'కు ఆమోదం తెలిపింది. ఐఎస్ఎం రెండో దశలో దేశీయంగా చిప్ డిజైన్, తయారీ, ప్యాకేజింగ్‌తో పాటు పరికరాలు, రసాయనాలు, ముడి పదార్థాల తయారీకి కూడా ప్రభుత్వం మద్దతు ఇవ్వనుంది. చిప్ డిజైన్ సంస్థలకు గ్రాంట్లు, ఈక్విటీ పెట్టుబడులు అందించడంతో పాటు, సరఫరా గొలుసులోని తయారీ యూనిట్లకు 30 శాతం ప్రోత్సాహకం ఇవ్వనుంది. ఇప్పటికే ఐఎస్ఎం కింద ఆమోదించిన 12 చిప్ తయారీ, ప్యాకేజింగ్ ప్రాజెక్టుల్లో మూడు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ దశలో మొత్తం రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు, రూ. 2 లక్షల కోట్ల ఉత్పత్తి, రూ. 1 లక్ష కోట్ల ఎగుమతులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు, 2026లో ముగిసిన పీఎల్ఐ పథకానికి బదులుగా తీసుకొచ్చిన ఎంపీఎంఎస్ భారత్‌ను కేవలం మొబైల్ అసెంబ్లీ కేంద్రంగా కాకుండా, సొంత బ్రాండ్లు, స్వదేశీ టెక్నాలజీ, పేటెంట్లతో కూడిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడంపై దృష్టి పెట్టింది. ఈ పథకం 2026-27 నుంచి ఐదేళ్ల పాటు అమలులో ఉంటుంది. ప్రస్తుతం చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా ఉన్న భారత్‌లో, 2024-25లో మొబైల్ ఉత్పత్తి విలువ రూ. 5.5 లక్షల కోట్లకు, స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ. 2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2025లో స్మార్ట్‌ఫోన్లు దేశంలోనే అత్యధిక విలువైన ఎగుమతి ఉత్పత్తిగా నిలిచాయి. కొత్త పథకం ద్వారా మొత్తం స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి విలువను సుమారు రూ. 39 లక్షల కోట్లకు పెంచడం, ఎగుమతులను మరింత విస్తరించడం, ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 60 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దీంతో భారత్ ప్రపంచానికి ఫోన్లు అసెంబుల్ చేసే దేశం నుంచి, వాటిని డిజైన్ చేసి, పేటెంట్ పొంది, ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసే టెక్నాలజీ కేంద్రంగా మారాలని కేంద్రం భావిస్తోంది.






